కుత్బుల్లాపూర్, నవంబర్ 8: పదో తరగతి ఫెయిల్ అయ్యాడు..జల్సాలకు అలవాటుపడ్డాడు. బేకరీలో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తే వచ్చే డబ్బులు సరిపోలేదు. విలాసవంతమైన జీవనం కోసం ప్రభుత్వ నిషేధిత మాదకద్రవ్యాలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు చేపడుతూ చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి మేడ్చల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొంపల్లిలో ఓ యువకుడు ఎండీఎంఏ డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు మేడ్చల్ ఎస్ఓటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఓ యువకుడు చిక్కాడు. అతడి వద్ద డ్రగ్స్ లభ్యం కావడంతో అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు.
గుజరాత్‌కు చెందిన గౌలాని ఆషీఫ్(30) కొన్నేండ్ల కింద తన కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి వలస వచ్చి కొంపల్లిలో ఉంటున్నాడు. బేకరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా కుటుంబ అవసరాలకు, జల్సాలకు డబ్బులు చాలకపోవడంతో మత్తు పదార్థాల వ్యాపారంలోకి దిగాడు. దీంతో ఎండీఎంఏ డ్రగ్స్‌ను మహారాష్ట్ర ముంబై నుంచి దిగుమతి చేసుకొని స్థానికంగా ఆన్లైన్ ద్వారా కస్టమర్లతో అమ్మకాలు చేపడుతున్నాడు.
నిందితుడి వద్ద లభించిన 20 గ్రాముల ఎండీఎంఏ విలువ రూ.4 లక్షల 40 వేలు ఉంటుందని తెలిపారు. అతడి నుంచి డ్రగ్‌ను కొనుగోలు మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రధాన నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో మేడ్చల్ అదనపు డీసీపీ పి.శోభన్‌కుమార్, ఏసీపీ రాములు, పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్, ఎస్ఓటీ సీఐ ఆర్.శ్యామ్‌సుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.