మేడ్చల్, నవంబర్ 14: వరుస అవినీతి ఆరోపణల నేపథ్యంలో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడి చేశారు. నగర శివారులో 44వ జాతీయ రహదారిపై ఉన్న కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో 15 మంది బృందం శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో కార్యాలయంలో పలువురు దస్తాలేఖరుల(కాపీరైటర్లు)తో పాటు రిజిస్ట్రేషన్‌కు వచ్చిన అర్జీదారులు ఉన్నారు. అందరినీ ప్రశ్నించిన అధికారులు కాపీరైటర్లను అదుపులోకి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన అర్జీదారులకు సంబంధించి యథావిధిగా రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఒకవైపు అర్జీదారుల రిజిస్ట్రేషన్ పనులు జరుగుతుండగానే.. మరోవైపు ఏసీబీ అధికారులు కాపీరైటర్లను విచారించారు.
ఎలాంటి పని లేకపోయినప్పటికీ సబ్ రిజస్ట్రార్ కార్యాలయంలో ఉన్న కాపీరైటర్లను అదుపులోకి తీసుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించారు. ఆ డాక్యుమెంట్ల సంబంధీకులకు ఫోన్ చేసి, ఎంత డబ్బు ఇచ్చారు అనే విషయాన్ని ఆరా తీశారు. వారి నుంచి వచ్చిన సమాచారాన్ని సేకరించారు. అందుబాటులో లేనివారిని అవినీతి నిరోధక శాఖ కార్యాలయాలనికి పిలిపించుకుని విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
సాధారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి రిజిస్ట్రేషన్ చేసుకునే వారు తప్పించి, దస్తాలేఖరులు, పైరవీకారులకు అనుమతి లేదు. కానీ అధికారులు కొంతమందిని మధ్యవర్తులుగా పెట్టుకొని.. దందా సాగిస్తున్నట్టు అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ప్రతి డాక్యుమెంట్‌కు ఇంత అని అధికారులు వసూలు చేస్తున్నట్టు వచ్చిన సమాచారంపై దాడులు చేశారు. అధికారులు విచారణలో ఆరోపణలకు బలం చేకూర్చే సమాచారం లభించినట్టు తెలిసింది. సోదాల్లో మాత్రం పెద్ద మొత్తంలో డబ్బులు దొరకనట్లు సమాచారం. శుక్రవారం 3.30 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి వరకు కొనసాగింది. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన అర్జీదారులను రిజిస్ట్రేషన్ అయిన తర్వాత బయటకు
పంపించేశారు.
మణికొండ, నవంబర్ 14: రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంంలో ఏసీబీ అధికారులు శుక్రవారం నార్సింగి మున్సిపాలిటీలోని గండిపేట సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సోదాలలో పలు ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దాడులు చేసిన సమయంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్ల నుంచి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. బయటి వ్యక్తులు కార్యాలయాల్లోకి రావడం చట్టరీత్యా నేరం అని స్పష్టం చేశారు. అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నట్లు అందిన ఫిర్యాదుల మేరకు సోదాలు చేపట్టామని ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు. కార్యాలయంలో దాడులు చేసిన సమయంలో అర్జీదారులతో పాటు 10 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారని తెలిపారు. వారిని విచారిస్తున్నామని తెలిపారు. సాధారణంగా డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలో రావాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ల రైటర్ల వద్ద ఉన్న దరఖాస్తులపై విచారణ జరుపుతున్నాం. విచారణ అర్ధర్రాతి వరకు కొనసాగుతుందని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.