మేడ్చల్: జీహెచ్ఎంసీ (GHMC) విలీనంలో మేడ్చల్ (Medchal) నియోజకవర్గం మూడు ముక్కలైంది. 7 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లను 16 డివిజన్లుగా విభజించడంతో పాటు మూడు జోన్లలో కలిపారు. పీర్జాదిగూడ, మేడిపల్లి, పోచారం, ఘట్కేసర్, ఎదులాబాద్, దమ్మాయిగూడ, కీసర డివిజన్లను ఎల్బీనగర్ జోన్లో.. జవహర్‌నగర్, చంద్రపురి కాలనీ, నాగారం, బోడుప్పల్, చెంగిచెర్ల, తూంకుంటను సికింద్రాబాద్ జోన్లో… గుండ్లపోచంపల్లి, కిష్టాపూర్, మేడ్చల్‌ను కూకట్పల్లి జోన్లోకి వెళ్లాయి. అయితే జోన్ల విజభన సరిగా లేదంటూ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి.
జవహర్‌నగర్‌లో 3 లక్షల వరకు జనాభా ఉండగా రెండు డివిజన్లుగా విభజించారు. దమ్మాయిగూడులో లక్షా 30వేల పైగా జనాభా ఉంటే రెండు డివిజన్లు చేయగా, లక్షకు పైగా జనాభా ఉన్న నాగారం మున్సిపాలిటీని విభజించలేదు. లక్ష వరకు జనాభా ఉన్న పోచారాన్ని కూడా విభజించలేదు. లక్ష వరకు జనాభా ఉన్న మేడ్చల్‌ను, 80వేల వరకు జనాభా ఉన్న ఘట్‌కేసర్‌ను రెండు డివిజన్లుగా విభజించారు. లక్షా 80వేల వరకు జనాభా ఉన్న బోడుప్పల్‌ను రెండు డివిజన్లుగా విభజించారు. లక్షన్నర వరకు జనాభా ఉన్న పీర్జాదిగూడను రెండు డివిజన్లుగా ఏర్పాటు చేశారు. ఇలా పొంతన లేకుండా జరిగిన విభజనతో ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి భారీ సంఖ్యలో అభ్యంతరాలు వెల్లువెత్తాయి.