Power Cuts | జూబ్లీహిల్స్ : ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో నగరంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. మార్చి నెలకు ముందే విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్‌తో వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, ఎల్లారెడ్డిగూడ, శ్రీకృష్ణానగర్, కళ్యాణ్‌నగర్, బోరబండతో పాటు 24 సబ్స్టేషన్లతో సేవలు అందిస్తున్న అధికారులు లో-వోల్టేజీ సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
బంజారాహిల్స్ డివిజన్లోని 1.80లక్షల మంది వినియోగదారులకు ఇప్పటికే 9971 విద్యుత్ నియంత్రిక (DTR)లతో విద్యుత్ సరఫరా చేస్తున్న అధికారులు.. ఈ ఏడాది 42 అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. సరఫరాలో అంతరాయం, లో వోల్టేజీ సమస్యను పూర్తిగా అధిగమించేందుకు 160 కేవీ కెపాసిటిలో 37 విద్యుత్ నియంత్రికలు.. 100 కేవీ కెపాసిటిలో ఐదు ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే సత్వరమే అక్కడికి చేరుకుని సేవలందించేందుకు సెంట్రల్ బ్రేక్‌డౌన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో డిమాండ్‌కు తగ్గట్లుగా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
వేసవిలో పెరిగే విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని సీబీడీ అధికారులు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వేసవిలో ఆయా సబ్స్టేషన్ల పరిధిలో పది మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. వేసవి వినియోగం ఒక్కసారిగా పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఆయా ట్రాన్స్‌ఫారాల వద్దకు అప్పటికప్పుడు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు తరలించి విద్యుత్ సరఫరా గావించనున్నారు. విద్యుత్ నియంత్రికల సామర్థ్యం పెంచడంతో పాటు ఇప్పటికే ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపడుతున్నారు. వేసవిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ ఈడీ హన్మంతరెడ్డి తెలిపారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న లైన్లలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు చేశామని.. లో వోల్టేజీ సమస్యను పూర్తిగా అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.