సిటీబ్యూరో, అక్టోబరు 8 (నమస్తే తెలంగాణ ) ః జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాజకీయ ప్రచార ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని సీపీఆర్వో విభాగంలో ఎంసీఎంసీ, మీడియా కేంద్రాన్ని ఆర్వీ.కర్ణన్ ప్రారంభించారు.
ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్, సోషల్ మీడియా, ఈ-పేపర్, ఇతర ఆన్లైన్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ప్రకటనలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటి నుండే ఎంసీఎంసీ కమిటీ ద్వారా అనుమతి తీసుకోవాలని కర్ణన్ తెలిపారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు ప్రచార ప్రకటనల కోసం ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి అన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు ప్రకటనల కోసం ఎంసీఎంసీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రింట్ చేసిన కరపత్రాలపై పబ్లిషర్ పేరు, చిరునామా, హ్యాండ్ బిల్ ఇతర పత్రాలు ముద్రించిన సందర్భంలో తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని సూచించారు. మీడియా కేంద్రం ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం మీడియా ప్రతినిధులకు అందించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, విజిలెన్స్ ఏఎస్పీ, ఎంసీసీ నోడల్ అధికారి నరసింహరెడ్డి, పీఆర్వో మామిండ్ల దశరథం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.