సిటీబ్యూరో, సెప్టెంబరు 8 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మతులు చేపట్టాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం మేయర్ అంబర్ పేట, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్ ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. రోడ్లపై ఏర్పడిన గుంతలు, చెడిపోయిన రోడ్లను బాగు చేయాలని.. వర్షాలతో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించాలన్నారు.
జోనల్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు,చీఫ్ ఇంజినీర్లతో పాటు ఇంజినీర్ అధికారులు మోటర్ సైకిళ్లపై క్షేత్రస్థాయిలో పర్యటించి గుంతలు, చెడిపోయిన రోడ్లు, తాగునీటి వసతి ఇబ్బందులను గుర్తించి పరిష్కరించాలన్నారు. మరోవైపు పునరావాస కార్యక్రమాలు, వినాయక చవతి ఏర్పాట్లపై జోనల్ కమిషనర్లతో మేయర్ తన చాంబర్ లో సమీక్షించారు. ప్రతి మండపం వద్ద ఒక చెత్తకుండీ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ శానిటేషన్ బి.సంతోశ్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, అశోక్ సామ్రాట్, ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మమత, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.