తెలుగుయూనివర్సిటీ : పరిణతవాణి ప్రసంగాలు సాహిత్య చరిత్ర నిర్మాణానికి దోహదం చేస్తాయని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 11 రోజుల పాటు కొనసాగనున్న పరిణతవాణి ప్రసంగాల పరంపర కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ విద్యావ్యాప్తికి, సాంస్కృతిక కళారంగాలకు, తెలుగు సాహిత్యం వికాసానికి అవిరళ కృషి చేస్తున్న పరిషత్తు మహోన్నత కవి పండితులు, రచయితల సాహిత్యం జీవితం గురించి వారి చేత ప్రసంగాలు చేయించడమే కాకుండా వాటిని పుస్తకరూపంలో ముద్రిస్తూ భావితతరాల కోసం గొప్ప వారసత్వ సంపదగా అందించడం అభినందనీయమన్నారు.
భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరిక్రిష్ణ మాట్లాడుతూ సాహిత్య పరిశోధకులు అందించే సమాచారం భావితరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ సాహితీమూర్తుల జీవన, సాహితీ విశేషాలు నేటి తరానికి స్పూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.
ప్రముఖ పరిశోధకులు , ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు ననుమాస స్వామి పరిణతవాణి 90 ప్రసంగం చేశారు. మంగళవారం ఇదే వేదికపై ఆచార్య మసన చెన్నప్ప పరిణతవాణి ప్రసంగం చేయనున్నారని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య తెలిపారు.