సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గిరిజన వస్తు సంస్కృతి, జానపద విజ్ఞాన కళలను ధ్వంసం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలుగు యూనివర్సిటీ వీసీ టి.కిషన్‌రావు, రిజిస్ట్రార్ భట్టు రమేశ్ అన్నారు. ఆద్యకళ సంస్థ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు ఆధ్వర్యంలో గోండు వస్తు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ‘కాడెల్ ఫెస్ట్ హైదరాబాద్ సంబురాలు -2023’ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథులుగా వీసీ, రిజిస్ట్రార్లు హాజరై శుక్రవారం ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ..మూలాల నుంచి వస్తున్న సంస్కృతిని కాపాడుకోవాలని, వస్తు సంస్కృతిని విద్యార్థులకు, పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు అందజేసే బాధ్యత మనదేనని చెప్పారు. ఆద్యకళ ఫౌండర్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు, జర్మనీలోని నట్టింగం ట్రెంట్ వర్సిటీ ప్రొఫెసర్ నికోల్ ధిమోరో, ఫ్రాన్స్‌లోని పాల్గ్ వెలిరోమాంటో పిల్లర్ వర్సిటీ ప్రొఫెసర్ జోదిత్ బరాఖ్ మాట్లాడుతూ.. జానపద గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు చర్చలు, ప్రదర్శనలు, పరిశోధనలు జరపాల్సిన ఆవశ్యకత ఉన్నదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ‘నెట్వర్క్ ఆన్ ది ట్రైబల్ అండ్ దలిత్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్’ అనే అంశంపై గోండు కళాకారుల సంగీత విన్యాసాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రొఫెసర్లు గిరిజ, టి.విజయ్‌కుమార్, కె.సత్యనారాయణ, ప్రముఖ పరిశోధకుడు ఎంఎన్ శ్రీనివాసన్‌తో పాటు ఆదివాసీ పరిశోధకులు గుంజాల గోండి లిపి తొడ్సం దేవ్‌రావ్, మేస్రం దుర్గు, కుమ్రం మోహన్, పీహెచ్డీ స్కాలర్స్ బి.జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
ఆద్యకళ ద్వారా ఏర్పాటు చేసిన ఆదివాసీ వస్తు సంస్కృతి ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నది. 7 ఉంచి 12 మెట్ల కిన్నెర, చుముకి వాద్య పరికరాలు, నగారా, చిట్కీ మిట్కీ (లవ్ బర్డ్స్), హౌనం, డమరుకం, జమిడిక, జముకు, డిమ్కి, చెక్కతోనే తయారు చేసిన దంపుడు రోళ్లు, పొలాల పండుగకు పశువులను అలంకరించే జీల-శిర్న, సంగీత వాద్య పరికరాలు (అనేక ధ్వనులు వినిపించే పరికరం), తదితర అరుదైన వస్తువులు ఆద్యకళలో కొలువుదీరాయి.