సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తీసుకుంటూ సాగే డ్రగ్స్ పార్టీలు.. వందల కొద్దీ అమ్మాయిలు, మహిళల నగ్న వీడియోలు.. బూతు పురాణాలు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఫిర్యాదులు.. వినేందుకే జుగుప్సాకరంగా తయారైన మస్తాన్ సాయి-లావణ్య వ్యవహారంలో ఇంకెన్ని మలుపులోనన్న చర్చ జరుగుతున్నది.
ఇటీవల నార్సింగి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్-లావణ్య మధ్య జరిగిన ఆడియో సంభాషణ లీకవడం.. మంగళవారం ఆయన్ని ఉన్నతాధికారులు ఐజీ కార్యాలయానికి అటాచ్ చేయడంతో అసలు ఈ కేసులో ఏం జరుగుతుందనే చర్చ ప్రధానంగా సాగుతున్నది. ఇప్పుడు అదికాస్తా అటు తిరిగి.. ఇటు తిరిగి.. పోలీసుల దాకా వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం మస్తాన్‌సాయిని పోలీసులు కస్టడీకి తీసుకొని రెండు రోజుల పాటు విచారించనున్న నేపథ్యంలో ఇంకా ఎన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి? ఇంకెంత మంది ఈ రొంపిలో పాత్రధారులుగా తేలనున్నారు? అనేవి ఆసక్తికరంగా మారాయి.
డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా పోలీసు శాఖ శాయశక్తులా కృషి చేస్తున్నది.. కఠినంగా వ్యవహరిస్తున్నది. అయినప్పటికీ చాపకింద నీరులా అది విస్తరిస్తుందనే ఆందోళన పెరుగుతూనే ఉంది. ఇందుకు ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య చేసిన ఫిర్యాదులో మస్తాన్ సాయి అనే వ్యక్తి విచ్చలవిడిగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించి వందలాది మంది మహిళల్ని ట్రాప్ చేశాడనే ఆరోపణ ఆందోళన కలిగించే పరిణామం. ఈ నేపథ్యంలో కేవలం ఈ ఫిర్యాదు కోణంలోనే కాదు.. డ్రగ్స్ మూలాలు, నగ్న వీడియోల నిగ్గు తేల్చాల్సిన గురుతర బాధ్యత పోలీసులపై పడింది.
వాస్తవానికి లావణ్య, మస్తాన్ సాయి, ఇతరుల మధ్య గొడవలు ఎలా ఉన్నా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌ల ద్వారా డ్రగ్స్, సరఫరా ముఠా మూలాలు బయటికొచ్చి కట్టడి చేసేందుకు పోలీసులకు అస్త్రంలా పనికొస్తాయని అందరూ అనుకున్నారు. దీంతో పాటు నగ్నవీడియోలు నిజమైనవా? కావా? అనేది తేలుతుందని భావించారు. కానీ అంతకుముందే అనూహ్యంగా రెండు రోజుల కిందట నార్సింగి డీఐ శ్రీనివాస్‌ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేయడంతో అసలేం జరుగుతుందనే చర్చ మొదలైంది.
పలానా కారణంతో డీఐ శ్రీనివాస్ అటాచ్ జరిగిందనే స్పష్టత పోలీసుల నుంచి రాకపోవడంతో అనేక ప్రచారాలు తెరపైకి వచ్చాయి. గతంలో లావణ్య డ్రగ్స్ కేసులో దొరికినపుడు ఇన్వెస్టిగేషన్ అధికారిగా డీఐ శ్రీనివాస్ ఉన్నారు. దీంతో ఆ కేసుకు, తాజా పరిణామానికి ఏమైనా సంబంధం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొన్నిరోజుల కిందట బయటికొచ్చిన డీఐ శ్రీనివాస్-లావణ్య ఫోన్ సంభాషణ ఇందుకు దారి తీసిందా? అనే చర్చ కూడా ఉంది.
ఈ కేసులో ఎట్టకేలకు పోలీసుల వినతిని అనుమతించిన రాజేంద్రనగర్ కోర్టు రెండు రోజుల కస్టడీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. హార్డ్ డిస్క్‌ల్లో ఉన్న డ్రగ్స్ పార్టీలు, సరఫరాకు సంబంధించిన సమాచారంతో పాటు నగ్న వీడియోలపై స్పష్టత రావాల్సిన అవసరముందని పలువురు కోరుతున్నారు. ఎందుకంటే వందలాది మంది మహిళలకు సంబంధించిన వ్యవహారం కావడంతో పాటు విచ్చలవిడిగా డ్రగ్స్ పార్టీలకు కట్టడి వేసేందుకు కీలక సమాచారం ఏమైనా పోలీసులకు దొరుకుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదేగాకుండా లావణ్య ఆరోపణలు నిజమైతే ఇంకెన్ని కొత్త పాత్రలు ఈ రొంపిలో కొత్తగా తెరపైకి రానున్నాయనేది కూడా చర్చనీయాంశమే.