మన్సూరాబాద్, జూలై 7: దుండగులు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.సుధీర్‌కృష్ణ కథనం ప్రకారం.. నాగోల్, జైపురికాలనీ సమీపంలోని గోల్డెన్ లీవ్స్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లా నం. 89లో పురుషోత్తంరెడ్డి, విల్లా నం. 22లో నర్సింహారెడ్డి తమ కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. పురుషోత్తంరెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లాడు. నర్సింహారెడ్డి సైతం కుటుంబసభ్యులతో కలిసి తన స్వగ్రామమైన నార్కెట్పల్లికి వెళ్లాడు. కాగా, శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత గోల్డెన్ లీవ్స్ విల్లాస్‌లోకి దుండగులు ప్రవేశించారు. పురుషోత్తంరెడ్డికి చెందిన విల్లా నం. 89 ఇంటి తాళం పగులగొట్టి, లోనికి ప్రవేశించారు. ఆ ఇంట్లో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు, లక్ష నగదును దోచుకెళ్లారు. అదేవిధంగా.. విల్లా నం. 22 తాళం కూడా పగులగొట్టిన దుండగులు.. ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ ఇంట్లో దొంగలకు నగలు దొరకలేదు. ఉదయం ఆ ఇంటిలో పని చేసేందుకు వచ్చిన పని మనిషి వచ్చింది. పురుషోత్తంరెడ్డి ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి.. వెంటనే యజమానికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చింది. హుటాహుటిన ఇంటికి చేరుకున్న పురుషోత్తంరెడ్డి.. ఇంట్లో దాచిన బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించాడు. పురుషోత్తంరెడ్డి భార్య హేమలతారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గేటెడ్ కమ్యూనిటీలో అమర్చిన సీసీటీవీ కెమెరాలు పని చేయడంలేదని పోలీసులు గుర్తించారు. ఓ విల్లాకు చెందిన యజమాని ఇంట్లో పని చేస్తున్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా.. అర్ధరాత్రి వేళ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్కాడ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. చోరీకి పాల్పడింది పార్ధీ గ్యాంగ్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డీసీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కృష్ణయ్య ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పీర్జాదిగూడ, జూలై 7: దైవ దర్శనానికి వెళ్లి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టిన దుండగులు రూ.3 లక్షల విలువజేసే బంగారు నగలు, సుమారు రూ.2లక్షల నగదు, 40 తులాల వెండి వస్తువులు దొంగిలించారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బోడుప్పల్ గ్రీన్‌సిటీ కాలనీలో నివాసముంటున్న రమేశ్ మెటీరియల్ కాంట్రాక్టర్. ఈ నెల 3న కుటుంబసభ్యులతో కలిసి అరుణాచల పుణ్యక్షేత్రం దైవదర్శనానికి వెళ్లాడు. తిరిగి ఆదివారం తెల్లవారు జామున వచ్చి చూడగా.. ఇంటి తాళం పగులగొట్టి ఉన్నది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలో దాచిన రూ.3లక్షల విలువైన 4 తులాల బంగారు నగలు, సుమారు రూ.2 లక్షల నగదు, 40 తులాల వెండి వస్తువులు కనిపించలేదు. బాధితుడు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.