బంజారాహిల్స్, నవంబర్ 5: ప్రజాసేవే పరమావధిగా నిరంతరం ప్రజల్లో ఉంటూ పని చేసిన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్నది. 1983నుంచి రాజకీయాల్లో ఉన్న మాగంటి గోపీనాథ్ తొలిసారిగా 2014లో టీడీపీ టికెట్ మీద జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా 2016లో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా నిలిచారు.
నియోజకవర్గ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో తనదైన శైలిలో ప్రజల్లో తిరుగులేని ఆదరణ పొందారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ లాంటి పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందించడం మాగంటి గోపీనాథ్ ప్రత్యేకతగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు సొంతడబ్బుతో సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
కరోనా కాలంలో విస్తృతంగా సామాజిక సేవ
కొవిడ్ కారణంగా 2020లో లాక్డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అండగా నిలిచారు. సుమారు రెండు నెలల పాటు నియోజకవర్గంలోని ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయడంతోపాటు లాక్డౌన్ సమయంలో ఆహార పదార్థాలను తయారు చేయించి ఇంటింటికీ పంపిణీ చేయించారు. నియోజకవర్గంలోని ఏడు డివిజన్లకు ఏడు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసిన మాగంటి గోపీనాథ్.. ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పంపిణీ చేయించి పేదలు, నిరాశ్రయుల ఆకలి తీర్చారు.
వలస కూలీలు, దినసరి కూలీలను గుర్తించి బీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా వారికి ప్రతిరోజూ ఆహారాన్ని పంపిణీ చేయించారు. కొవిడ్ సమయంలో ఆహారంలో ప్రొటీన్స్ ఉండాలని వైద్యుల సూచనలతో చికెన్, గుడ్లతో ఆహారాన్ని అందజేశారు. అదే సమయంలో రంజాన్ మాసం రావడంతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింల కోసం హలీమ్‌తో పాటు బిర్యానీ తయారు చేయించి ఇంటింటికీ పంపిణీ చేయించారంటూ నేటికీ స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. కొవిడ్ టీకాలు వేయించేందుకు ప్రత్యేక శిబిరాలతోపాటు ప్రతిఏటా ఉచిత వైద్య శిబిరాలు, కళ్లద్దాల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించేవారు.
రికార్డు నెలకొల్పిన రక్తదాన శిబిరం
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తున్న తరుణంలో అనేక ఆసుపత్రుల్లో రక్తం నిల్వలు అడుగంటాయి. దీంతో రోడ్డుప్రమాదాల్లో క్షతగాత్రులు, తలసేమియా లాంటి ప్రమాదకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తం దొరక్క ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తింది. దీంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించాలని సంకల్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిటెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా 2021 జూలై 24న యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో సుమారు 2వేలమంది కార్యకర్తలతో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రెడ్‌క్రాస్ సొసైటీతోపాటు ఇతర బ్లడ్‌బ్యాంక్‌లకు అందజేయించారు. కొవిడ్ సమయంలో ఒకేచోట అంతమంది రక్తదానం చేయడం సరికొత్త రికార్డుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది.
కార్యకర్తలకు ఎలక్ట్రిక్ స్కూటీలు
నిత్యం పార్టీ కోసం పనిచేస్తూ ప్రజల్లో ఉండే బీఆర్ఎస్ కార్యకర్తల కోసం మాగంటి గోపీనాథ్ సుమారు 200 ఎలక్ట్రిక్ బైక్‌లు అందజేసి తనలోని మంచితనాన్ని చాటుకున్నారు. బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే కార్యకర్తలకు తనవంతు చేయూతనిచ్చేందుకు 2023 జూలై 24న కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సుమారు 200 ఎలక్ట్రిక్ బైక్‌లను ఉచితంగా అందజేశారు. ఎలక్ట్రిక్ బైక్‌లు అందుకున్న వారిలో ఎక్కువమంది మహిళా కార్యకర్తలే ఉండడం విశేషం. వీటితోపాటు వికలాంగులకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఉచితంగా ట్రై సైకిళ్లు, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్టేషనరీ, స్కూల్ బ్యాగ్స్ తదితర వస్తువులను నిరంతరం అందించేవారు.
వీణావాణీలకు అండగా మాగంటి..
యూసుఫ్‌గూడ స్టేట్‌హోంలో ఉంటున్న వీణావాణికి మాగంటి గోపీనాథ్ చిన్నతనం నుంచి అండగా నిలిచారు. కేసీఆర్, కేటీఆర్ పుట్టిన రోజున స్టేట్‌హోమ్‌కు వెళ్లడంతో పాటు వీణావాణిలతో కలిసి సంబురాలు చేసుకునేవారు. వీణావాణి చదువుల్లో రాణించడంతో వారికి ప్రత్యేక బహుమతులు అందించేవారు.
ప్రతి ఇంట్లో మాగంటి బహుమతులే..
దసరా, రంజాన్, క్రిస్మస్ ఇలా ఏ పండుగ వచ్చినా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు గుర్తుకు వచ్చేది మాగంటి గోపీనాథే. 2012నుంచి తన చివరి శ్వాస వరకు మాగంటి గోపీనాథ్ పండుగలను నియోజకవర్గ ప్రజలతోనే చేసుకునేవారు. ప్రతి పండుగకూ మహిళలకు ప్రత్యేకంగా చీరలు ఇవ్వడం, బహుమతులు ఇవ్వడం అలవాటుగా మార్చుకున్నారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా ఒక్కో డివిజన్లో సుమారు 5వేల మందికి సొంత డబ్బులతో చీరలు పంపిణీ చేయడంతోపాటు పండుగల సందర్భంగా బహుమతులు అందజేసేశారు. రంజాన్‌తో పాటు క్రిస్మస్కు ప్రత్యేకంగా బహుమతులు తయారు చేయించి స్వయంగా పంపిణీ చేసేవారు. నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రచారానికి వస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి మరీ గోపీనాథ్ ఇచ్చిన బహుమతులను చూపిస్తున్నారంటే ఆయన అందించిన బహుమతులు మహిళలను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలుస్తున్నది.