నేరేడ్మెట్, జూన్ 8: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గణపవరం గ్రామానికి చెందిన శివదానపు దేవనందిని(25).. 2022 నవంబర్ 8న పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన తిరుమల రేవంత్ కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం దంపతులు నేరేడ్మెట్లోని జేజేనగర్ ఎస్ఎస్బీ క్లాసిక్ అపార్ట్మెంట్లో నివాసముంటూ ప్రైవేటు జాబ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
శనివారం ఉదయం రేవంత్ కుమార్ పనిమీద బయటకు వెళ్లి, తన భార్యకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో ఇంటికి చేరుకుని చూడగా బెడ్రూమ్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని దేవనందిని మృతిచెందినట్లు గుర్తించాడు. మృతురాలి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా ఆమె లోన్‌యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు, బకాయి చెల్లింపు కోసం యాప్ నిర్వాహకులు తీవ్రంగా వేధిస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఈ వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రి భీమవరపు వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.