కంటోన్మెంట్, ఆగస్టు 18: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (ఆర్పీ)ల సంక్షేమ సంఘం (మెప్మా) సమస్యలపై బుధవారం బోయిన్పల్లిలోని మల్లారెడ్డి ఫంక్షన్హాల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మర్రి రాజశేఖర్రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల కష్టాలు, సమస్యలను తెలుసుకుని పరిష్కరించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలో రిసోర్స్ పర్సన్స్(ఆర్పీ) కు వేతనాలు రావడం లేదనే విషయాన్ని ఉద్యోగులు తన దృష్టికి తీసుకువచ్చారని, వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆర్పీల వేతనాలు విడుదల చేయించడంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.
ప్రభుత్వం ప్రతి ఉద్యోగిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదని, ఉమ్మడి పాలకుల వ్యవస్థలో ఉద్యోగులకు కలిగిన ఇబ్బందులను ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కొక్కటిగా దూరం చేస్తూ ముందుకుసాగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యలను సైతం పరిష్కరించే దిశగా చొరవ తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ఆర్పీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతతో పాటు పద్మ, శ్రీను, చంద్రకళ, ఆయా మున్సిపాలిటీల పరిధిలోని రిసోర్స్ పర్సన్స్, తదితరులు పాల్గొన్నారు.