సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఒడిశా నుంచి రాజస్థాన్‌కు హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ. 6.25 కోట్ల విలువైన గంజాయిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మీడియాకు వెల్లడించారు.
రాజస్థాన్, జోదాపూర్ ప్రాంతానికి చెందిన విక్రమ్ విష్ణోయ్ అలియాస్ వికాస్ వృత్తిరీత్యా డ్రైవర్. రాజస్థాన్‌లోని జోదాపూర్ ప్రాంతంలో గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాలో ఏజెంట్‌గా పనిచేసే దేవిలాల్ ద్వారా డీసీఎం యజమాని అయిన రామ్‌లాల్, రాజస్థాన్‌లోని ఆయా ప్రాంతాలలోని స్మగ్లరకు గంజాయి సైప్లె చేసే అయూభ్ఖాన్లతో పరిచయం ఏర్పడింది. ఓడిశా మల్కాన్‌గిరి నుంచి రాజస్థాన్‌కు గంజాయి రవాణా చేస్తే ఒకో ట్రిప్పుకు రూ. 5 లక్షలు ఇస్తామంటూ విక్రమ్ విష్ణోయ్కి ముఠా సభ్యులు హామీ ఇచ్చారు.
ఈ మేరకు టాటా అల్ట్రా ట్రక్ వాహనాన్ని విక్రమ్‌కు ఇచ్చి, అందులో రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర నాందేడ్ వరకు ఐరన్ లోడ్‌ను వేసి పంపించారు. నాందేడ్‌లో లోడ్ ఖాళీ చేసిన విక్రమ్ హైదరాబాద్ నుంచి ఖమ్మంకు వెళ్లాడు. అక్కడ తన వాహనంలో సిమెంట్ సంచులు నింపుకున్నాడు, తన వాహనంలోని ట్రాలీ భాగంలో వెనుక వైపు సిమెంట్ సంచులు వేసి ముందుభాగాన్ని ఖాళీగా ఉంచాడు.
ఆ తరువాత ఒడిశాలోని మల్కానిగిరి ప్రాంతానికి వెళ్లి ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి 1210 కిలోల గంజాయి ప్యాకెట్లను తన వాహనంలో లోడ్ చేయించాడు. ఎవరికి అనుమానం రాకుండా వెనుక సిమెంట్ సంచులుండగా ముందు గంజాయి ప్యాకెట్లను నింపుకొని తిరిగి రాజస్థాన్‌కు బయలుదేరాడు. హైదరాబాద్ మీదుగా రాజస్థాన్ వెళ్తుండడంతో విశ్వసనీయ సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ జోన్ బృందం, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులతో కలిసి కొత్తగూడెం క్రాస్‌రోడ్డు వద్ద విక్రమ్ విష్ణోయ్ డ్రైవ్ చేస్తూ వస్తున్న వాహనాన్ని ఆపారు.
అందులో తనిఖీలు నిర్వహించగా భారీ ఎత్తున గంజాయి బయటపడింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద లభించిన రూ. 6.25 కోట్ల విలువైన గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సంబంధించిన కీలక ముఠా సభ్యుల కోసం గాలింపు చేపట్టారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ ఎల్బీనగర్ అదనపు డీసీపీ షకీర్ హుస్సేన్, ఏసీపీ పి.సత్తయ్య, మహేశ్వరం ఇన్స్పెక్టర్ ఎస్ఓటీ సీపీ రవికుమార్ బృందం, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు పాల్గొన్నారు.