మారేడ్పల్లి, జూలై 27: ఇటీవల కురిసిన వర్షాలకు సికింద్రాబాద్ జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో ఈ ప్రాంతం గుండా వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జేబీఎస్ ఇన్ గేట్, అవుట్ గేట్ వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో బస్సులు, ఆటోల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ సమస్యను గుర్తించిన మారేడ్పల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తన సొంత డబ్బులతో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. జేబీఎస్ ఇన్, అవుట్ గేట్ వద్ద గుంతలమయంగా మారిన రోడ్డుపై మట్టితో.. ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వాహనదారులు, పాదచారులు మారేడ్పల్లి ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని అభినందించారు. తమ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులు సురక్షితంగా ప్రయాణించడమే లక్ష్యమని, తమ వంతు సేవ చేసినట్లు ఇన్స్పెక్టర్ భాస్కర్ వెల్లడించారు.