సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న 12 మందిని మారేడ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చందనా దీప్తి వివరాలను వెల్లడించారు. చిలుకానగర్‌కు చెందిన భానుప్రసాద్ ప్రైవేట్ ఉద్యోగి. ఈనెల 10వ తేదీ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జేబీఎస్ వద్ద తన స్నేహితుడిని దింపి, తిరిగి ఇంటికి బయలుదేరాడు. కంటోన్మెంట్ బస్‌స్టాప్ సమీపంలోకి రాగానే.. ఆరుగురు వ్యక్తులు అతడిని అడ్డుకొని దాడిచేసి సెల్‌ఫోన్ లాక్కొని పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న మారేడ్‌పల్లి పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. సికింద్రాబాద్‌కు చెందిన వనపర్తి ప్రభుకుమార్, గుండమాల మనీశ్ కుమార్, మల్కాజిగిరికి చెందిన దాసారం శ్రీకాంత్, షేక్ అష్రఫ్ అహ్మద్, కొలుపుల రాజా, యాప్రాల్‌కు చెందిన పోలిపోగు రాజును నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల వద్దనుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన సూరజ్ కుమార్ యాదవ్ కూలీ. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుండగా 10వ తేదీ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై పేపర్ కటింగ్ బ్లేడ్‌తో దాడి చేశారు. అతడి వద్ద నుంచి రూ. 10 వేల నగదు, సెల్‌ఫోన్ లాక్కొని పారిపోయారు. ఆ తరువాత గణేశ్ ఆలయం వెనుక నుంచి బీహారీ యాదవ్ నడుచుకుంటూ వెళ్తుండగా.. అతడిపై బ్లేడ్ బ్యాచ్ దాడిచేసి రూ. 1700 నగదు, సెల్‌ఫోన్ లాక్కొని పారిపోయారు. ఈ రెండు వేర్వేరు ఘటనలపై కేసులు నమోదు చేసుకున్న మారేడ్‌పల్లి పోలీసులు.. దర్యాప్తు చేపట్టి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో నేపాల్ నుంచి వచ్చి సికింద్రాబాద్ ప్రాంతంలో నివాసముంటూ డెకొరేషన్ పనులు చేస్తున్న సందీప్ బహదూర్, మారేడ్‌పల్లికి చెందిన అలూరి దిలీప్, బెంజకంటి రాజేశ్, పసుపుల కిరణ్, సమీర్, మణికంఠ ఉన్నారు. వీరికి గతంలో నేర చరిత్ర ఉన్నదని డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి పేపర్ కట్టర్‌తో పాటు రూ. 700 నగదు, ఒక వివో మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
చట్టాన్ని ఉల్లంఘించి చిన్న చిన్న వివాదాలు, నిబంధనలు భేఖాతరు చేసే వాళ్లపై కేసులు నమోదవుతున్నాయి. దాడులు, దోపిడీలు, దొంగతనాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. నేరస్థులు హైదరాబాద్‌లో తప్పించుకోవడం అసాధ్యం. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాల నిఘా ఉంది. నిరంతరం పెట్రోలింగ్ పోలీసుల నిఘా కొనసాగుతుంది. ఒక వైపు పెట్రోలింగ్ పోలీసులు, మరోవైపు సీసీ కెమెరాల నిఘా నుంచి దొంగలు తప్పించుకోలేరు. బోనాల పండుగ సందర్భంగా మద్యం మత్తులో దోపిడీలు చేసినట్టు నిందితులు చెబుతున్నారు. ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు ఉపేక్షించరు. చిన్నతనంలో చేసే చిన్న పొరపాట్లు భవిష్యత్తులో పెద్ద నేరాలకు దారి చూపుతాయి. ఇది మంచిది కాదు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగి నేరాలు చేయవద్దని, యువత తమ భవిష్యత్తు బాగుపరుచుకునే విధంగా చట్టాన్ని గౌరవించాలని డీసీపీ సూచించారు. ఈ సమావేశంలో మారేడ్‌పల్లి ఇన్స్పెక్టర్ నేతాజీ పాల్గొన్నారు.