బంజారాహిల్స్, ఆగస్టు 17: గత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల కారణంగా హైదరాబాద్ నగరం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీపడే స్థాయికి చేరుకుందని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎన్ఎండీసీతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్-2023’ 12వ ఎడిషన్‌కు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం గురువారం బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్ హోటల్లో నిర్వహించారు. ఆగస్టు 26, 27 తేదీల్లో నిర్వహించనున్న మారథాన్ వివరాలను రేస్ డైరెక్టర్ ప్రశాంత మోర్పారియా వెల్లడించారు. మారథాన్‌లో భాగంగా ఆగస్టు 26న హైటెక్స్ వద్ద 5కే రన్ ప్రారంభం కానున్నది. ఆగస్టు 27న ఉదయం 4:30 గంటలకు పీపుల్స్ ప్లాజా వద్ద ఫుల్ మారథాన్, 5:30గంటలకు హాఫ్ మారథాన్, ఉదయం 6:30గంటలకు మాదాపూర్‌లోని హైటెక్స్ వద్ద 10కే రన్ప్రారంభం కానున్నదని తెలిపారు. ఈ మారథాన్‌లో దేశవిదేశాలకు చెందిన సుమారు 20వేల మంది రన్నర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్న తరుణంలో హైదరాబాద్ అనేక నగరాలతో పోటీ పడుతున్నదని తెలిపారు. హైదరాబాద్ మారథాన్‌లో పోలీసుశాఖ కూడా చురుకైన పాత్ర పోషిస్తుందని, ఈవెంట్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎండీసీ సీఎండీ అమితవా ముఖర్జీ, నిరీష్ లాలన్ తదితరులు పాల్గొన్నారు.