సుల్తాన్‌బజార్, నవంబర్ 12: ఉద్యోగుల సంక్షేమానికి టీఎన్జీవో కేంద్ర సంఘం నిరంతరం కృషి చేస్తున్నదని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, డాక్టర్ ఎస్ఎం. ముజీబ్ హుస్సేనీలు తెలిపారు. బుధవారం నాంపల్లి గృహకల్ప ఆవరణలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.విక్రమ్ కుమార్, కురాడి శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించనున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అవగాహన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యమానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి నివారించదగిన వ్యాధులపై మహిళా ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా కమిటీ కేవలం హక్కుల కోసమే కాకుండా ఉద్యోగుల ఆరోగ్య భధ్రతకు కూడా పాటుపడుతూ రాష్ట్రంలోని ఇతర యూనియన్లకు ఆదర్శప్రాయంగా నిలవడం అభినందనీయమని అన్నారు. ఉద్యోగినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళా ఉద్యోగినులు తమ పని ఒత్తిడిలో వ్యక్తిగత ఆరోగ్యాన్ని, ప్రధానంగా స్క్రీనింగ్ పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఉందన్నారు. సరైన సమయంలో అవగాహన, స్క్రీనింగ్ పరీక్షలతో ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. మహిళా ఉద్యోగులందరూ ఈ అవగాహన సదస్సుకు హాజరై, వైద్య నిపుణుల సలహాలు, సూచనలను పొందాలని, తద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం కోశాధికారి ముత్యాల సత్య నారాయణ గౌడ్, సంఘం సభ్యులు కొండల్‌రెడ్డి, ఉమాదేవి, శైలజ, హైదరాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి ఖాలేద్ అహ్మద్, సభ్యులు శంకర్, వైదిక్ శస్త్రి, శ్రీధర్ నాయుడు, ముఖీం ఖురేషి తదితరులు పాల్గొన్నారు.