సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : కేబీఆర్ పార్క్ మల్టీ లెవల్ పార్కింగ్ టెండర్ ప్రక్రియలో ఎన్నో మలుపులు, మరెన్నో మడతలు ఉన్నాయి. పేరుకు వెహికిల్ పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నామని చెబుతున్నా… దీని వెనుక ఎంతో మంది పెద్దల చేతులు ఉన్నాయి. ఆ నేతల అడుగులకు మడుగులు వేస్తూ దస్ర్తాలను సునాయాసంగా కదిలిస్తున్న అధికారుల పాత్ర ఉంది. పెద్దల సూచనలకు అనుగుణంగా కంపెనీ కోసం పార్కుకు చెందిన 1000 గజాల జాగాను అప్పనంగా కట్టబెట్టేలా బల్దియాలో సంబంధిత ఓ ఉన్నతాధికారి అన్ని తానై చక్రం తిప్పుతున్నాడు.
పార్కింగ్ పేరిట బల్దియాలో అడుగుపెట్టి…. శివారు ప్రాంతాల్లో ప్రకటన రంగాన్ని తమ గుప్పిట్లోకి పెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి… ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లుగా టాక్. అయితే టెండర్ల ప్రక్రియ నుంచి వర్క్ ఆర్డర్లు పొందేంత వరకు అన్నీ తానై బల్దియా వ్యవహారాలను చక్కబెట్టిన అధికారుల సాయంతో కోట్ల రూపాయల మాయాజాలం జరుగుతున్నదని జోరుగా చర్చ జరుగుతున్నది. ఇప్పటికే కేబీఆర్ పార్క్ మల్టీ లెవల్ పార్కింగ్ టెండర్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలను వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ లోతైన పరిశీలనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కదులుతున్న అవకతవకల పుట్ట..
కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సముదాయం కేటాయింపు వ్యవహారంలో అవకతవకల పుట్ట కదులుతుంది. ఈ ప్రక్రియలో జరిగిన బాగోతాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ 484 గజాలు మాత్రమే నవ నిర్మాణ అసోసియేట్ సంస్థకు ఇచ్చినట్లు అధికారికంగా చెబుతున్నారు. కానీ ‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు 484 గజాల జాగాను మాత్రమే ఆ కంపెనీ మల్టీ లెవల్ పార్కింగ్ యార్డు నిర్వహించుకునేందుకు అనుమతించింది. కానీ దాని వెనకాలే ఉన్న మరో 1000 గజాల పార్కు జాగాను కూడా ఆ సంస్థ చేతిలో పెట్టే కుట్ర జరుగుతున్నదని తేలిపోయింది. ఈ ఒక్క టెండర్‌తో కేటాయించిన 484 గజాల జాగాతోపాటు, అదనంగా 1000-1100 గజాల స్థలం నవ నిర్మాణ అసోసియేట్స్ సంస్థ చేతిలోకి అనధికారికంగా చేరనుందని వెల్లడైంది. పార్కింగ్ స్థలం లీజు పేరిట ఏకంగా కోట్లు విలువ చేసే 1000 గజాల విలువైన జాగాను ఎలాంటి టెండర్లు లేకుండానే నొక్కేసే బాగోతంలో బల్దియా అధికారులతోపాటు, ప్రభుత్వ పెద్దల హస్తంతోనే ఈ వ్యవహారం సజావుగా సాగిపోతున్నది.
1000 గజాల జాగా కోసం స్కెచ్..
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించకుండా తిరస్కరించిన ఈ వ్యవహారం వెనుక పెద్ద స్కెచ్ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో వెనక్కి పంపిన దస్ర్తాన్ని ఒక్క ఫోన్ కాల్‌తో మళ్లీ తెరమీదకు తీసుకురావడంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి పాత్ర ఉందని తెలిసింది. ఆయన వేసిన భారీ స్కెచ్ ప్రకారమే ఈ వ్యవహారం అంతా జరుగుతున్నదని సమాచారం. అయితే ఇందులో బల్దియా అధికారులు ఆ బడా నేతకు వంతా పాడుతూ ఎంతో క్లిష్టమైన వ్యవహారాన్ని కూడా కేక్ వాక్‌లా మార్చివేయడం ఇప్పుడు ఆ విభాగాధికారులనే విస్తుపోయేలా చేస్తోంది. ప్రకటనల విభాగాన్ని గద్దలా హస్తగతం చేసుకునేందుకు హైడ్రా అధికారులను ముందుండి ఆ నేత నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేబీఆర్ పార్కు వద్ద విలువైన 1000 గజాల జాగా కోసం, కాగితాలపై 484 గజాల విస్తీర్ణంలో మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ పేరిట ప్రైమ్ ఏరియాలో బడా నేతలు అడుగుపెట్టారని, కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం ఎనిమిది ప్రాంతాల్లో పార్కింగ్ యార్డులు ఉన్నాయి. వీటిని కూడా తమ నియంత్రణలోకి తీసుకోవాలంటే… పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న మల్టీ లెవల్ పార్కింగ్ యార్డ్ విజయవంతంగా కమిషన్ చేసేందుకు అధికారులతోపాటు, బడా నేతల అనునూయులు వ్యవహారాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో జోనల్ కమిషనర్ స్థాయిలో ఉన్న సంబంధిత ఓ అధికారి పాత్ర ఉందని బల్దియాలో చర్చ జరుగుతున్నది.
‘మల్టీ లెవల్’ కోసం అన్ని బలి…
కేబీఆర్ పార్కు చుట్టూ వాకర్లకు, సందర్శకుల సౌకర్యం కోసం లూ కేఫ్ పేరుతో టయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా మల్టీ లెవల్ పార్కింగ్ కోసం బలి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పార్కింగ్ యార్డులో ఉండే కేఫ్ మాత్రమే ఆ ప్రాంతంలో ఉండే విధంగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అయితే కొత్తగా నిర్మిస్తున్న మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ద్వారా స్వచ్ఛత కోసం ఏర్పాటు చేసిన లూ కేఫ్‌లను బలి చేయడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వారికి నోటీసులు కూడా ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. తద్వారా ఆ స్థలాన్ని కూడా తమ వాణిజ్య అవసరాల కోసం వాడుకునే కుట్రకు తెరలేపనున్నారు. స్వచ్ఛభారత్ లో భాగంగా ఏర్పాటు చేసిన లూ కేఫ్‌లకు జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. అదేవిధంగా ప్రధాన రహదారికి ఆనుకుని ఉండే పుట్ పాత్‌లు, బస్ స్టాప్‌లను తొలగించి రోడ్డు ఫేసింగ్కు వచ్చేలా రెస్టారెంట్స్, కాఫీ షాపుల లాంటి మడిగేలు ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయని, పార్కింగ్ కోసం అయితే భారీగా లాభాలు రావని, దీనొక మల్టీ పర్పస్ బిజినెస్ వెంచర్‌గా మార్చే ప్రకటనల నుంచి మొదలుకుని ఫుడ్ కోర్టుల వరకు ఇలా ఆ ప్రాంతాన్ని కమర్షియల్ సెంటర్‌గా మార్చనున్నారు.
అస్మదీయులకు కట్టబెట్టేలా…
వన్ టైమ్ ప్యాకేజీ తీసుకుని అస్మదీయులకు ప్రాజెక్టు కట్టబెట్టే క్రమంలో… వివిధ ప్రాంతాల్లో ప్రకటనల వ్యాపారాన్ని తమకు ఇచ్చేలా కండిషన్లు కూడా ఉన్నాయని తెలిసింది. హోర్డింగుల వ్యాపారాన్ని చేజిక్కించుకునేందుకు ఈ టెండర్ రహదారిలా మారినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పేరుకు అంత పారదర్శకంగా జరుగుతున్నదని బల్దియా వర్గాలు చెబుతున్నా.. వెనుక జరిగే బాగోతాలు, కుట్రల గురించి తెలిసి ఇప్పుడు బల్దియా వర్గాలే విస్తుపోతున్నాయి. ఇప్పటికే ఆ సంస్థ శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో భారీ డిజిటల్ తెరలను ఏర్పాటు చేసి దందాకు తెరలేపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ నిబంధనల విషయంలో పక్కాగా ఉండే హైడ్రా కంటికి మాత్రం ఆ నిబంధనలు పాటించని హోర్డింగుల వెలుగులు కనిపించడం లేదనే విమర్శలున్నాయి. ఇలా నగర శివారుల్లోని హోర్డింగులు, ప్రకటనల విభాగాన్ని తమ చేతుల్లోకి తీసుకునే కుట్రలో తొలి అడుగే కేబీఆర్ పార్క్ మల్టీ లెవల్ పార్కింగ్ వ్యవహారమని సమాచారం. దీని తర్వాత ఒక్కొక్క ప్రాజెక్టును క్రమంగా అస్మదీయులకు కట్టబెట్టడమే అసలు ఉద్దేశమని, ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఒక్క టెండర్ ద్వారా కేబీఆర్ పార్క్ వద్ద కోట్లు విలువ చేసే కమర్షియల్ స్థలాన్ని చేజిక్కించుకోవాలని ఆ సంస్థ వేస్తున్న అడుగులపై వాకర్లు కూడా నోరెళ్లబెడుతున్నారు.