సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): నగరంలో భారీ వర్షానికి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం వర్షం వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలకు సమస్యలు రాకుండా ఏమి చేయాలనే కనీస చర్యలు చేపట్టకపోవడంతో రోజు రోజుకు నగరంలో వర్షం కారణంగా చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లపై ఎక్కడికక్కడే నీళ్లు నిలిచిపోయాయి, అండర్‌పాస్‌ల కింద గంటల తరబడి నీళ్లు అలాగే ఉండిపోయాయి.
కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న ముషీరాబాద్‌కు చెందిన షర్ఫుద్దీన్ బల్కంపేట్‌లోని అండర్‌పాస్ దాటేందుకు ప్రయత్నించి, అందులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి హబీబ్‌నగర్‌కు చెందిన మామ, అల్లుడు రాము, అర్జున్‌లో నాలాలో కొట్టుకుపోయారు, అందులో అర్జున్ మృతదేహాన్ని మూసీలో గుర్తించగా, రాము ఇంకా గల్లంతులోనే ఉన్నాడు. అలాగే వినోభానగర్‌కు చెందిన దినేశ్ నాలాలో కొట్టుకుపోయాడు. బుధవారం రాత్రి, గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నాలాలు పొంగిపొర్లాయి, వర్షం కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించడంపై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.