మలక్‌పేట, నవంబర్ 18: చాదర్‌ఘాట్ పరిధిలోని మూసానగర్ వినాయక్ వీధిలో ఉన్న కల్తీ వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారి శృతి, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబు ఆధ్వర్యంలో సోమవారం దాడిచేసి కుళ్లిపోయిన ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను అరెస్ట్‌చేసి, నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. బేగంబజార్ కేంద్రంగా నడుస్తున్న ఈ కల్తీ వెల్లులి పేస్ట్ తయారీ, మార్కెటింగ్ రాకెట్‌ను ఛేదించేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
కల్తీ వెల్లుల్లి పేస్ట్ తయారీకి వాడే ముడి పదార్థాలను చూసి అధికారులు నివ్వెరపోయారు. కుళ్లిపోయి కంపుకొడుతున్న వెల్లుల్లి బస్తాలు దర్శనమిచ్చాయి. అక్కడ యాసిడ్‌ను కూడా వాడుతున్నట్లు గుర్తించారు. పేస్ట్‌లో అల్లానికి బదులుగా అల్లం ఫ్లేవర్ కోసం, ఇతరత్రా పదార్థాలు, ఎక్కువకాలం నిలువ ఉండేందుకు ఎసిటిక్ యాసిడ్‌ను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. పేస్ట్ తయారీ విధానమంతా ఒకేచోట కాకుండా వేర్వేరు ప్రదేశాల్లో చేస్తున్నారని, పొట్టు తొలగించిన వెల్లుల్లి రబ్బలను బేగంబజార్‌కు తరలించి అక్కడ పేస్ట్‌ను తయారు చేసి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారని అధికారులు తెలిపారు.