పహాడీషరీఫ్, ఏప్రిల్ 9: సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. అయితే వారి కుటుంబానికి సంబంధించి గత రెండు నెలలగా ఎలాంటి గొడవలు తెరపైకి రాకపోవడంతో మోహన్‌బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు తాను హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటున్నారు. మరో వైపు మనోజ్ కూడా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో గతంలో జరిగిన కుటుంబ తగాదా వ్యవహారులు సద్దుమనిగాయని భావిస్తున్న తరుణంలో తాజాగా గురువారం ఉదయం హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్‌బాబు ఇంట్లోకి వెళ్లడానికి మంచు మనోజ్ ప్రయత్నించగా.. అక్కడ భద్రత నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ అతన్ని లోనికి రాకుండా అడ్డుకున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తన అనుమతి లేనిదే ఎవరూ లోపలికి రాకూడదని, ఇది నా ఆర్డర్ అనే హెచ్చరిక బోర్డును మెహన్ బాబు జల్పల్లిలోని ఇంటి గేటుకు ఏర్పాటు చేశారు.
అయితే తాను లోపలికి వెళ్లేందుకు కోర్టు అనుమతి ఉం దంటూ మనోజ్ చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది అతడిని లోపలికి అనుమతించలేదు. దీంతో మనోజ్ గేటు బయటే బైఠాయించి నిరసనకు దిగారు. మనోజ్ భార్య మౌనిక సైతం అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు మోహన్‌బాబు ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఇతరులు అక్కడికి వెళ్లకుండా మోహన్ బాబు ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తున్నారు. మనోజ్ గేటు బయట ఆందోళనకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
కారు పోయిందంటూ ఫిర్యాదు..
తన కారు పోయిందని మంచు మనోజ్ మంగళవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 1వ తేదీన తన పాప పుట్టిన రోజు వేడుకల నిమిత్తం రాజస్థాన్ వెళ్లగా ఇదే అసరాగా తన సోదరుడు విష్ణు 150మందితో జల్పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి తన సామగ్రి ధ్వంసం చేశారని మనోజ్ ఆరోపించారు. తన కార్లలో కొన్నిటిని టోయింగ్వాహనంతో లాక్కెళ్లి రోడ్డుమీద వదిలేశారని, మరికొన్నిటిని దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశారన్నారు. అలాగే తన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారని పేర్కొన్నారు.
అనుమతి ఉన్నా రానివ్వడం లేదు.
మోహన్ బాబు ఇంటి ఎదుట బైఠాయిం చిన మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఆస్తిలో చిల్లిగవ్వ వద్దని నాన్నకు ఎప్పుడో చెప్పానన్నారు. డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతుంటే ఇప్పటివరకు పోలీసులు ఒక్క చార్జిషీట్ ఫైల్ చేయలేదని, కొంతమంది ప్రవేట్ వ్యక్తులు కత్తులు, కర్రలతో మాపైకి వచ్చినా అన్ని ఆధారాలు ఇచ్చినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మనోజ్ ఆరోపించారు. తనకు జల్పల్లిలోని ఇంట్లో ఉండేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని, అయితే వాళ్లు అనుమతి లేదని ఇంట్లోకి రానివ్వడం లేదని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.