ఖైరతాబాద్, డిసెంబర్ 15 : నిమ్స్‌లో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుత నిరసన చేపడుతున్న నర్సింగ్ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం ఆర్టికల్ 19ను ఉల్లంఘించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్, క్యాడర్ రిప్యూ, స్టాఫ్ రిక్రూట్మెంట్, గ్రాట్యూటీ, కాన్సాలిడేట్ పేమెంట్ ప్రాతిపదికన పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది వివిధ డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తెచ్చినా.. పట్టించుకోకపోవడంతో నిమ్స్ నర్సెస్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది.
వారం రోజులుగా శాంతియుత నిరసన తెలుపుతున్నారు. కాగా, సోమవారం శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు నర్సింగ్ ఉద్యోగులు ప్రయత్నించగా, బయటకు రాకుండా గేటుకు తాళం వేయడంతో నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రి వెలుపలే నిలబడి ప్లకార్డులతో యాజమాన్యం తీరును ఖండించారు.
నిమ్స్‌లో ఉద్యోగుల బాగోగులు చూసుకోవాల్సిన డైరెక్టర్ తన విధులను విస్మరిస్తున్నారని నర్సింగ్ ఉద్యోగులు ఆరోపించారు. దీర్ఘకాలికంగా అనేక రూపాల్లో వినతి పత్రాలు ఇచ్చినా బుట్టదాఖలు చేశారని, చివరకు సమ్మె చేస్తామంటే నిరసనలను అడ్డుకునేందుకు అడ్డదారులు వెతికారని విమర్శిస్తున్నారు. ఓ సారి మధ్యవర్తిగా ఓ సీనియర్ అధికారిణి పంపించగా, ఆమెను తరమికొట్టిన నర్సింగ్ ఉద్యోగులు.. ఆ తర్వాత డైరెక్టర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు సమాయత్తమవుతూ సోమవారం నిరసన ర్యాలీకి బయలుదేరారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బందితో గేట్లకు తాళం వేయించడాన్ని నర్సింగ్ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. అంతా డైరెక్టర్ చేతుల్లోనే ఉందని, కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా నర్సింగ్ ఉద్యోగుల నిర్బంధ విషయం సంగారెడ్డిలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి వెళ్లగా, వెంటనే ఆయన వారిని పిలిపించుకొని సమస్యలపై ఆరా తీసినట్లు తెలిసింది. డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్లు వస్తేనే తాము తమ సమస్యలను వివరిస్తామని చెప్పడంతో వారిని సైతం పిలిపించక తప్పలేదు. వారు అక్కడికి చేరుకోగానే డైరెక్టర్‌పై నర్సింగ్ ఉద్యోగులు పలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
గత డైరెక్టర్లు తమకు కల్పించిన సౌకర్యాలన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారని, పదవీ విరమణ పొందిన వారికి కొన్ని బెనిఫిట్లకు సంబంధించిన డబ్బులు రూ.4 లక్షలు కట్ చేస్తున్నారని, ఇప్పటికే ఓ ఉద్యోగిని డబ్బులు కట్ చేశారని, మరో 20 మంది జాబితా సిద్ధం చేశారంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన డైరెక్టర్‌కు చివాట్లు పెట్టినట్లు సమాచారం. ఈ నెల 17న స్పెషల్ రిప్యూ పెట్టాలని, తాను కూడా వస్తానని, ఇంత చిన్న సమస్యను పరిష్కరించడంలో ఎందుకు తాత్సారం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా, హామీలు సరిపోదని, లిఖిత పూర్వకంగా ఆర్డర్స్ ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని మంత్రికి స్పష్టం చేసినట్లు నర్సింగ్ ఉద్యోగులు తెలిపారు.