Creek School | మేడ్చల్: ఫీజు బకాయి చెల్లించడంలేదని ఓ విద్యార్థిని పాఠశాలలో నిర్బంధించిన ఘటన మేడ్చల్ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ పట్టణంలోని క్రిక్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఫీజు బకాయి రూ.లక్ష చెల్లించాల్సి ఉన్నది. ఇటీవల అతడి తండ్రి రూ.70వేలు కట్టాడు. ఇంకా రూ.30వేలు చెల్లించాల్సి ఉంది. మంగళవారం పాఠశాలకు వచ్చిన సదరు విద్యార్థిని ఫీజు బకాయి ఉన్నదని స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపించలేదు. సాయంత్రం 6 గంటలైనా విద్యార్థి రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి.. పాఠశాలకు ఫోన్ చేస్తే ఫీజు చెల్లించని కారణంగా స్కూల్లోనే ఉంచినట్టు సమాధానం ఇచ్చారు. ఉదయం 9 గంటల వరకు ఫీజు చెల్లిస్తానని, లేకుంటే పాఠశాలకు అనుమతించవద్దని కోరాడు. ఇందుకు యాజమాన్యం ఒప్పుకోలేదు.
గంట లోపు ఫీజు చెల్లించి, విద్యార్థిని తీసుకెళ్లాలని హుకూం జారీ చేసింది. కోపోద్రిక్తుడైన విద్యార్థి తండ్రి పాఠశాలకు వద్దకు వచ్చాడు. ఆ లోగా పాఠశాల సిబ్బందితో బైక్పై పంపించేందుకు యాజమాన్యం సన్నద్ధమైంది. విద్యార్థి తండ్రి మాట్లాడుతూ పాఠశాలలో ఫీజుల కోసం విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. విద్యా సంవత్సరం ముగిసేందుకు మూడు నెలల ముందుగా ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారన్నారన్నారు. తన కుమారుడు కడుపు నొప్పివస్తున్నదని, ఇంటికి పంపించాలని ఏడ్చినా.. పట్టించుకోలేదని వాపోయాడు. కాగా, విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నేత సంతోష్ రాథోడ్ విద్యార్థులను ఫీజుల కోసం వేధిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.