ఖైరతాబాద్, జనవరి 5 : పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు స్పాలు అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారాయి. గుట్టుచప్పుడు కాకుండా క్రాస్ మసాజ్‌లు, నిర్వహణలో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఏక కాలంలో ఆరు స్పాలపై దాడి చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఒక్క బంజారాహిల్స్ రోడ్డు నంబర్.1లోనే నాలుగు స్పాలు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… మాదాపూర్‌లోని అరుణోదయకాలనీకి చెందిన అహిమ్ దాంగ్ (29) బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని చంద్ర రెసిడెన్సీలో ధనిక ఎక్స్‌క్లూజీవ్ స్పా అండ్ సెలూన్ ,అమీర్‌పేట్ లీలానగర్‌కు చెందిన జి. ప్రీతి (32) లాల్‌బంగ్లా వద్ద నేచురల్ వెల్నెస్ స్పా ,బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో నివాసం ఉండే అభిలాష్ (26) బంజారహిల్స్ రోడ్డు నంబర్ 1లోని క్రీమ్ స్టోన్ భవనంలో రేగో థాయ్ స్పా , సికింద్రాబాద్ హకీంపేటకు చెందిన డి. అనిల్ కుమార్ (29) అమీర్‌పేట లాల్‌బంగ్లా వద్ద ఉన్న కంట్రీ ఓవెన్ భవనంలోని మొదటి అంతస్తులో వాల్యూమ్ స్పా నిర్వహిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్వహిస్తుండటంతో పాటు ఎలాంటి రిజిస్టర్‌ను నిర్వహించడం లేదని పోలీసులు గుర్తించి కేసు పెట్టారు.
లొట్టిపల్లి రమేశ్ (26) బంజారాహిల్స్ రోడ్ నం.1లో క్యూపిడ్ కర్వ్ బిల్డింగ్‌లోని ప్లాట్ నం. 402లో హీలిల్ హార్ట్ బ్యూటీ స్పాను నిర్వహిస్తున్నాడు. చట్టం, నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్వహిస్తున్న స్పా యజమాని రమేశ్‌పై కేసు నమోదు చేయడంతో పాటు స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే భవనంలో నివాసం ఉండే ముంగంద రత్నాకర్ ఓజాస్ ఆయుర్వేద వెల్నెస్ అండ్ సెలూన్ పేరుతో స్పాను నిర్వహిస్తున్నాడు. పోలీసులు దాడి చేసి తనిఖీలు చేపట్టగా, ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. యజమాని రత్నాకర్‌తో పాటు మేనేజర్ గాజా అయేషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.