రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ)/కందుకూరు: మాయమాటలు చెప్పి బాలికను అపహరించి లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు శివాజీ (20)కి యావజ్జీవ కారాగార జైలు శిక్ష, 25వేల జరిమానా విధిస్తూ, బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం అందజేయాలని ఆదేశిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. ప్రత్యేక పీపీ సునీత బర్ల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కన్నాయిపల్లి గ్రామానికి చెందిన నిందితుడు కందుకూరు మండలం మీర్ఖాన్పేట గ్రామ పరిధిలో నిర్మిస్తున్న పవర్ గ్రిడ్ సబ్ స్టేషన్లో కూలీగా పని చేశాడు.
కల్వకుర్తి మండలానికి చెందిన బాలిక కుటుంబం సైతం అక్కడే గుడిసెలు వేసుకుని పవర్ గ్రిడ్‌లో పని చేశారు. ఈ క్రమంలో బాలికతో నిందితుడు పరిచయం పెంచుకున్నాడు. 2017, ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి బాలికను పెండ్లి పేరుతో మభ్యపెట్టి, మాయమాటలు చెప్పి సికింద్రాబాద్‌కు తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
రెండు రోజుల తరువాత బాలికను ఇంటికి వద్ద దింపేసి వెళ్లిపోయాడు. బాలిక తండ్రి కందుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తదుపరి దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.