వెంగళరావునగర్, సెప్టెంబర్ 18 :స్నేహితుడి వద్ద తీసుకున్న రూ.1000 అప్పు ఆ వ్యక్తి ఊపిరి తీసింది. బాకీ చెల్లించలేదని మార్కెట్లో అందరి ముందు స్నేహితుడు దాడి చేయడంతో పాటు అతని భార్య చెప్పుతో కొట్టడాన్ని అవమానంగా భావించి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చో టుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..జవహర్‌నగర్‌లో నివాసం ఉండే బి.బాలాజీ(28) అవసరాల కోసం స్నేహితుడు సైదులు వద్ద రూ.1000 అప్పు తీసుకున్నాడు.
ఈ నెల 16న తన భార్య మానసతో కలిసి జవహర్‌నగర్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. అదే సమయంలో వచ్చిన సైదులు తన బాకీ డబ్బు ఇవ్వాలని బాలాజీతో గొడవపడి దుర్భాషలాడి దాడి చేశాడు. సైదులు భార్య దుర్గ అందరి ముందు చెప్పుతో బాలాజీని కొట్టింది. బుధవారం ఉదయం దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికెళ్లాడు. ఆ అవమానభారం బాలాజీని తీవ్ర మనస్తాపానికి గురిచేసింంది.
అదే రోజు సాయంత్రం ఇంట్లో తన గొంతుకు ఉరేసుకుని బాలాజీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా భర్త బాలాజీ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపిం చాడు. వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైన సైదులు, అతని భార్య దుర్గపై మృతుడు భార్య మానస పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.