బంజారాహిల్స్,మార్చి 3: మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పాటు విడాకులు ఇవ్వడం లేదన్న కోపంతో భార్యపై కత్తితో దాడిచేసిన భర్తను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్‌లో నివాసం ఉంటున్న వడ్డెమాన్ నిర్మలకు 2009లో వడ్డెమాన్ అడివన్న (45)తో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. మూడేళ్లుగా ఊర్మిళ అనే మహిళతో అడివన్న వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తనకు విడాకులు ఇస్తే ఊర్మిళను పెళ్లి చేసుకుంటానంటూ పలుమార్లు భార్య నిర్మలతో గొడవకు దిగడంతో పాటు తీవ్ర పదజాలంతో దూషిస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 18న నిర్మలతో గొడవపడిన అడివన్న అమెపై విచక్షణారహితంగా దాడికి దిగడంతో పాటు కత్తితో దాడి చేశాడు.
బాధితురాలు చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్ అయింది. పెద్దలు సముదాయించడంతో నిర్మల కేసు పెట్టలేదు. ఇదిలా ఉండగా రెండ్రోజుల క్రితం మరోసారి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అడివన్న నిర్మలను దూషించడంతో పాటు కడుపులో తన్నాడు. అంతటితో ఆగకుండా మరోసారి కత్తితో బెదిరిస్తూ నిర్మలతో పాటు ఆమె పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. విడాకుల కోసం తన భర్త తనపై కత్తితో దాడి చేశాడని, అతడివల్ల తనకు, తనపిల్లలకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు నిర్మల ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడు అడివన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.