e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home హైదరాబాద్‌ ఐదు సర్కిళ్లు.. 17 లక్షల మొక్కలు

ఐదు సర్కిళ్లు.. 17 లక్షల మొక్కలు

ఐదు సర్కిళ్లు.. 17 లక్షల మొక్కలు
  • హరితహారానికి అంతా సన్నద్ధం
  • కూకట్‌పల్లిజోన్‌లో 100 నర్సరీలు
  • త్వరలో మొక్కల పంపిణీ ప్రారంభం

కేపీహెచ్‌బీ కాలనీ, జూన్‌ 6 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారానికి జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ యేడాది హరితహారంలో ప్రజలందరినీ భాగస్తులను చేస్తూ హరితహారాన్ని విజయవంతం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. గతంలో మాదిరిగా కాకుండా కాలనీలు, బస్తీలలో ఖాళీ స్థలాలను నర్సరీలుగా మార్చి స్థానికంగానే మొక్కలు పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో మొక్కలను ఉంచేలా ఈ నర్సరీలను ఏర్పాటు చేశారు. మరోవైపు కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలలో అవగాహన కల్పిస్తూ అందరినీ హరితహారంలో భాగస్తులను చేసేలా కూకట్‌పల్లి జోన్‌ బయో అర్బన్‌ డైవర్సిటీ అధికారులు ముమ్మరంగా చర్యలు ప్రారంభించారు.

కూకట్‌పల్లి జోన్‌లో 100 నర్సరీలు..

కూకట్‌పల్లిజోన్‌ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 100 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 10వేల మొక్కల నుంచి లక్ష మొక్కలను సిద్ధంగా ఉంచారు. గతంలో సర్కిల్‌కు ఒకటి రెండు చోట్ల మాత్రమే నర్సరీలు ఉండగా ఆ నర్సరీలలో కొన్ని రకాల మొక్కలు మాత్రమే పెంచడానికి అవకాశం ఉండేది. కానీ ఈ యేడాది అన్ని రకాల మొక్కలను పెంచుతూ పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే మొక్కలకు ప్రాధాన్యతనిచ్చారు. నర్సరీలలో తులసి, పూల మొక్కలు, కలబంద, వేప, కాంచనం, రావి, మర్రి, ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా, నేరేడు, అడవి బాదం, పొగడ, కానుగ, పత్తెడ, రేలా వంటి దేశీయ మొక్కలతో పాటు ఫౌంటెన్‌ ట్రీ, బాటిల్‌ బ్రష్‌, టెంపుల్‌ ట్రీ, పుత్రంజీవ, లక్ష్మీతారు, పింక్‌ తబేబుయా, ఎల్లో తబేబుయా, కేఫ్‌ హనీసకల్‌ తదితర జాతి మొక్కలను పెంచుతున్నారు.

17.50 లక్షల మొక్కలు..

కూకట్‌పల్లిజోన్‌లోని మూసాపేట, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, అల్వాల్‌ సర్కిళ్లలో 17.50 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కాలనీలు, బస్తీలలోని ఖాళీ ప్రదేశాలు, ఫుట్‌పాత్‌లకు ఇరువైపులా మొక్కలు నాటే అవకాశాలను పరిశీలిస్తున్నారు. స్థలం అందుబాటులో ఉంటే మల్టీలేయర్‌ ఎవెన్యూ ప్లాంటేషన్‌తో మొక్కలు విరివిగా నాటే పనులను చేపట్టారు. రోడ్ల మధ్యలో సింగిల్‌ మొక్కలు నాటడం, థీమ్‌ పార్కులు, యాదాద్రి తరహా పార్కులను సిద్ధం చేస్తూ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. అలాగే వర్షంనీటి కాలువలకు ఇరువైపులా, చెరువులకు చెందిన బఫర్‌ జోన్‌, శ్మశానవాటికలు, ఫ్లైఓవర్లు, పార్కులలో మొక్కలు నాటే అవకాశాలపై ఆరా తీస్తున్నారు.

హరితహారానికి సన్నాహాలు..

హరితహారాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కాలనీలు, బస్తీలలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచాం. అనువైన ప్రాంతాల్లో మొక్కలు నాటడంతో పాటు ప్రజలకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కరోనా నేపథ్యంలో గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు, బస్తీ, కాలనీల సంక్షేమ సంఘాల నేతలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరినీ హరితహారంలో భాగస్తులను చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే నర్సరీలలో తులసి మొక్కల పంపిణీని ప్రారంభించాం. – వి.మమత, జడ్సీ, కూకట్‌పల్లి జోన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐదు సర్కిళ్లు.. 17 లక్షల మొక్కలు

ట్రెండింగ్‌

Advertisement