అంగట్లోఅండాలు
మహానగరంలో అవయవాలే కాదు.. జీవ కణాలు సైతం అంగట్లో అమ్మె సరుకుగా మారాయి. మొన్న అలకానంద కిడ్నీ రాకెట్..నిన్న నమ్రత అద్దె గర్భం రాకెట్.. నేడు అండాల రాకెట్.. వైద్య, ఆరోగ్యశాఖ అవినీతి, నిర్లక్ష్యంతో మహానగరం అవయవాలు, అద్దె గర్భాలు, అండాల విక్రయ కేంద్రంగా మారుతోంది
- ఐవీఎఫ్ కేంద్రాల ముసుగులో అక్రమ వ్యాపారం
- పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠా..9 మంది అరెస్టు
- మొన్న అలకానంద కిడ్నీ రాకెట్.. నిన్న నమ్రత ఐవీఎఫ్ రాకెట్.. నేడు అండాల అక్రమ వ్యాపారం
- గుట్టురట్టు చేసిన పోలీసులు
మహానగరంలో అవయవాలే కాదు.. జీవ కణాలు సైతం అంగట్లో అమ్మె సరుకుగా మారాయి. మొన్న అలకానంద కిడ్నీ రాకెట్..నిన్న నమ్రత అద్దె గర్భం రాకెట్.. నేడు అండాల రాకెట్.. వైద్య, ఆరోగ్యశాఖ అవినీతి, నిర్లక్ష్యంతో మహానగరం అవయవాలు, అద్దె గర్భాలు, అండాల విక్రయ కేంద్రంగా మారుతోంది. నిరుపేద మహిళలే లక్ష్యంగా చేసుకుని, అక్రమంగా అండాలు సేకరించి వ్యాపారం చేస్తున్న ఓ ఘరానా ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టు చేశారు. బేగంపేట, సరూర్ నగర్ పోలీసులతో పాటు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు సంయుక్తంగా నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. 9 మందిని అరెస్టు చేసి, వివిధ రాష్ట్రాలకు చెందిన 49 మంది మహిళలకు విముక్తి కల్పించారు. మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో సీపీ సుమతి వివరాలు వెల్లడించారు.
సిటీబ్యూరో/మారెడుపల్లి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): నిరుపేద మహిళలే లక్ష్యంగా చేసుకుని, అక్రమంగా అండాలు సేకరించి వ్యాపారం చేస్తున్న ఓ ఘరానా ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టు చేశారు. బేగంపేట, సరూర్ నగర్ పోలీసులతో పాటు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్ , మలాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో అక్రమంగా అండాల వ్యాపారం చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి, వివిధ రాష్ట్రాలకు చెందిన 49 మంది మహిళలకు విముక్తి కల్పించారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి సీపీ సుమతి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. నిందితులు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర , తదితర రాష్ట్రాల నుంచి పేద మహిళలను డబ్బు ఆశ చూపి హైదరాబాద్‌కు తీసుకువచ్చి, అద్దె ఇళ్లలో, హాస్టళ్లలో ఉంచి, ఐవీఎఫ్ , ఫెర్టిలిటీ కేంద్రాల్లో అండం సేకరణ ప్రక్రియకు పంపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని సీపీ వివరించారు.
రెండేళ్లుగా నడుస్తున్న దందా…
మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన అమిత్ శర్మ (44) ఈ ముఠాకు ప్రధాన సూత్రదారిగా వ్యవహరిస్తున్నాడని, కోల్‌కతాకు చెందిన నిక్కత్ పర్వీన్ (31)తో కలిసి బేగంపేట, ప్రకాశ్‌నగర్‌లో రెండేండ్లుగా ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అండాల సేకరణ సాగిస్తున్నట్లు సీపీ వివరించారు. నాంపల్లికి చెందిన వ్యాపారి ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్ (42) సరూర్‌నగర్ కేంద్రంగా మరో ముఠాను నడిపిస్తున్నాడు. వివిధ రాష్ర్టాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద మహిళలను స్థానిక ఏజెంట్లు, సబ్ ఏజెంట్ల ద్వారా గుర్తించి, అండాల దానం చేస్తే రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఇస్తామని ఆశ చూపి, వారిని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి రహస్య వసతి గృహాల్లో ఉంచి అండాలను సేకరిస్తుంటారు. ఒక్కో మహిళ నుంచి సేకరించిన అండాల ద్వారా ఫెర్టిలిటీ కేంద్రాల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణ వెల్లడైనట్లు తెలిపారు.
వైద్య పర్యవేణ లేకుండానే మందులు…
మహిళలకు వైద్యుల పర్యవేక్షణ లేకుండా హర్మోన్ల పై ప్రభావం చూపే హ్యుయోగ్ హెచ్‌పీ 150 ఐయూ ఇంజెక్షన్లు, ప్రిమోలుట్, మెప్రాట్ మాత్రలు ఇచ్చినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. దాడుల్లో ఇంజెక్షన్ వయల్స్, సూదులు, సిరంజీలు, మందులు, అనుమానాస్పద పత్రాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నివాస గృహాల్లో బయోమెడికల్ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకుండా ప్రజారోగ్యానికి ముప్పు కల్గించారని, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) చట్ట నిబంధనలకు విరుద్ధంగా నకిలీ గుర్తింపు కార్డు, బోగస్ అఫిడవిట్లతో ఒకే మహిళ నుంచి పలు మార్లు అండాలను సేకరించినట్లు దర్యాప్తులో తెలిందని సీపీ సుమతి వెల్లడించారు.

ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా మహిళల సమీకరణ…
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ వ్యవహారం నిర్వాహకులు, రిక్రూటర్లు, ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా సాగినట్లు అనుమానిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో మహిళలను గుర్తించి, అండం దానం ద్వారా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి హైదరాబాద్‌కు తరలించేవారని తెలుస్తోంది. హైదరాబాద్‌కు తీసుకువచ్చిన మహిళలను అద్దె ఇళ్లలో ఉంచి, అనంతరం అండాశయ ఉద్దీపన, అండం సేకరణ ప్రక్రియల కోసం ఫెర్టిలిటీ సేవలందించే సంస్థలకు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళల నియామకం, రవాణా, వసతి, వైద్య ప్రక్రియలకు సంబంధించి నిర్వాహకులు, మధ్యవర్తులు సమన్వయం చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫెర్టిలిటీ కేంద్రాల పైనా విచారణ…
బేగంపేట, సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ల లో మూడు కేసులు నమోదు చేశామని తెలిపారు. అక్రమ కార్యకలాపాల్లో ఫెర్టిలిటీ కేంద్రాల పాత్రపైనా విచారణ చేపట్టనున్నట్లు సీపీ సుమతి తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆసుపత్రుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంతాన సాఫల్య చికిత్సల కోసం దంపతులు గుర్తింపు పొందిన కేంద్రాలను ఆశ్రయించాలని సూచించారు. మహిళలను చికిత్స లేదా ఉపాధి పేరుతో అనుమానాస్పందంగా నిర్భందించినట్లు తెలిస్తే డయల్ 100కు లేదా సమీప పోలీసు స్టేషన్లో సమాచారం అందించాని సూచించారు. ఈ సమావేశంలో డీసీపీలు సిహెచ్. శ్రీధర్, కె. మనోహర్, ఏసీపీలు పి.గోపాలకృష్ణమూర్తి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూడు కేసులు నమోదు
దాడుల ఆధారంగా బేగంపేట పోలీస్ స్టేషన్లో ఒకటి, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్ ), 2023లోని సంబంధిత సెక్షన్లతో పాటు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్ ) చట్టం, 2021లోని సెక్షన్లు 29, 33 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తొమ్మిది మంది అరెస్టు..
ఈ కేసులో ప్రధాన నిందితులు అమిత్ శర్మ, నిక్కత్ ఫర్వీన్, దుర్గాప్రసాద్ తో పాటు సికింద్రాబాద్‌కు చెందిన సబ్ ఏజెంట్ రేష్మా ఖాతూన్ (26) ఏఆర్టీ కో ఆర్డినేటర్లు మేఘావత్ శ్రీనివాస్ అలియాస్ సోను (23) , ప్రదీప్ ( 27) , డాక్యుమెంటేషన్ బాధ్యతలు చూసే విజయ్ భగవాన్‌రావు సాలుంకే (46), క్యాటరింగ్ సరఫరాదారుడు పంకజ్ పోనీ (52), షేక్ ఫర్వీన్ (42) లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. విజయ్ భగవాన్రావుకు ఉన్న పరిచయాల ద్వారా నగరంలో పలు సంతాన సాఫల్య కేంద్రాలతో లావాదేవీలు సాగిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

