హైదరాబాద్ : దోమకాటు వల్ల వ్యాపించే వ్యాధుల్లో మలేరియా ముఖ్యమైనది. అనోఫేలస్ అనే రకమైన ఆడదోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దని, దీని వల్ల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. ముఖ్యంగా చికిత్స ఆలస్యమైతే వ్యాధి ముదురుతుందని, అరుదుగా మలేరియా గుండెపై కూడా తీవ్ర ప్రభావం చూపించవచ్చని పేర్కొంటున్నారు.
ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా వ్యాధి తీవ్రత, నివారణకు సంబంధించి వైద్యులు పలు సూచనలు చేశారు. మూత్రపిండాలు, కాలేయంపై మలేరియా ప్రభావం చూపుతుందని, రక్తహీనతకు దారి తీస్తుందని వైద్యులు చెప్తున్నారు. మలేరియా ప్రభావం గుండెపైనా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పడొచ్చని, గుండె వైఫల్యానికి కారణం కావొచ్చని హెచ్చరిస్తున్నారు.