కొండాపూర్, మార్చి 13 : చందా నగర్ లోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న అను ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నిచర్ దుకాణం కావడంతో క్షణాల్లో మంటలు పూర్తి భవనానికి అంటుకున్నాయి. జాతీయ రహదారిపై భారీ ఎత్తున మంటలు రావడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న చందా నగర్ పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అను ఫర్నిచర్ భవనం 5 అంతస్తులకు మంటలు వ్యాపించగా, షాప్ మూసివేసి ఉండటంతో లోపల ఎవ్వరు లేరని, వర్కింగ్ వేళల్లో జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన భవనం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బాలానగర్ ఏసీపీ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.