ఖైరతాబాద్, జనవరి 7 : పేదలకు నీడ కల్పించేందుకు గత ప్రభుత్వ హయాంలో వేలాదిగా డబుల్ గృహాలు నిర్మించారు. తద్వారా ఎందరో తమ సొంతింటి కల నిజం చేసుకున్నారు. పటాన్‌చెరూ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం, కొల్లూరు గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలు ప్రస్తుతం కొందరికి కాసుల పంట పండిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో గత ఏడాది కిందట కొత్త ప్రభు త్వం ఏర్పడిన తర్వాత అక్కడ సౌకర్యాలు, సదుపాయాలను విస్మరించడంతో పలువురు గృహాలకు తాళాలు వేసి మళ్లీ అద్దె గృహాల్లోకి వెళ్లిపోయారు. దాని ఆసరాగా చేసుకున్న కొందరు ఒక్కో ఇంటికి అక్రమంగా మెయింటెనెన్స్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇవ్వకుంటే పట్టాలను రద్దు చేయిస్తామని బెదిరింపులకు సైతం పాల్పడుతున్నట్లు తెలిసింది.
2018లో సుమారు 145 ఎకరాల్లో రూ.1,489.29 కోట్లతో 117 బ్లాకుల్లో, సిల్ట్ + 9, 10, 11 అంతస్తుల్లో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను చేపట్టారు. 2023 జూన్ నాటికి నిర్మాణం పూర్తయ్యింది. నగరంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు అప్పటి ప్రభుత్వం విడతల వారీగా అందిస్తూ వచ్చింది. 2023 నవంబర్‌లో ఎన్నికల నగరా మోగగా, గృహాల పంపిణీకి బ్రేక్ పడింది. 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారడంతో డబుల్ బెడ్రూం గృహ యజమానులకు ఇక్కట్లు మొదలయ్యాయి.
కరెంటు, నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నిర్వహణ బాధ్యతలను అధికార యంత్రాంగం విస్మరించింది. అనేక మంది సొంతింటిని వదిలి తిరిగి అద్దె గృహాలకు వెళ్లిపోయారు. అదే అదునుగా భావించిన కొందరు అధికార పార్టీ అండతో… అక్కడ మెయింటెనెన్స్ దుకాణం తెరిచినట్లు తెలిసింది. ఇండ్లలో ఉండకుంటే తమ పట్టాలను రద్దు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతూ ఒక్కో ఇంటికి నెలకు రూ.2వేల చొప్పున వసూలు చేస్తున్నారని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్‌కు చెందిన పలువురు లబ్ధిదారులు వాపోయారు.
తమ ఇండ్లు తమకే ఉండాలంటే నెలకు మెయింటెనెన్స్ చార్జీలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారని, ప్రతి బ్లాక్కో అడ్మిన్ అవతారమెత్తి తమ వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలంగా తమ గృహాలకు తాగునీటిని ఇబ్బందులు కలుగుతున్నాయని, లిఫ్టులు పనిచేయడం లేదని, నిత్యం విద్యుత్ కోతలు జరుగుతున్నాయని, దిక్కుతోచని స్థితిలో సొంతిళ్లను వదిలి కిరాయిండ్లలో ఉండాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.