బంజారాహిల్స్, ఏప్రిల్ 22 : సమైక్య పాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూ గులాబీ జెండా ఎగిరి 25ఏండ్లు పూర్తయ్యాయి. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సుసాధ్యం చేయడంతో పాటు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణను ముందుకు తీసుకువెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో వరంగల్లో ఈనెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దారు. రజతోత్సవ సభకు హైదరాబాద్ జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
1969నుంచి తెలంగాణ రాష్ట్రసాధన కోసం అనేక పోరాటాలు జరిగిన బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన ఉద్యమనేత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాటం అద్భుతమైనది. నేను 1983నుంచి రాజకీయాల్లో ఉన్నాను. సినీరంగంలో అనేక అద్భుతాలు సాధించిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడం ఒక చరిత్ర. అదే విధంగా అనేకమంది హేమహేమీలు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయత్నించి ఓడిపోయిన పరస్థితుల్లో తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రసాధన కోసం టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలందరిని ఒక్కతాటిమీదకు తెచ్చి తెలంగాణ సాధించుకున్న ధీరుడు కేసీఆర్.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమనేత కేసీఆర్తో మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్న నమ్మకంతో 2014లో ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారు. కేసీఆర్ పదేళ్లపాటు జనరంజకమైన పరిపాలన అందించి వారి గుండెల్లో నిలిచిపోయా రు. ఆకలితో అలమటించిన పేదలకు కన్నకొడుకులా సంక్షేమ పథకాలు అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి దేశాన్నే ఆశ్చర్యపరిచేలా సాగింది. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు నగరంలో మంచినీరు, కరెంట్ పుష్కలంగా ఉన్నాయి. దేశంలోనే లివబుల్ సిటీగా హైదరాబాద్కు ఘనత వచ్చింది.
అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ప్రజల గుండెల్లో మాత్రం ఉంది. ప్రజల తరపున నిరంతరం కొట్లాడుతోంది. 16 నెలల కాంగ్రెస్ పాలనలో జనం విసిగిపోయారు. కేసీఆర్ ఉంటే బాగుండు అంటూ జనం అంటున్నారు. అంతటి ప్రభావం చూపిన కేసీఆర్ పాలనను జనం మళ్లీ కోరుకుంటున్నారు. వరంగల్లో జరగనున్న రజతోత్సవ సభతో రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయం. జనం గుండెల్లో కేసీఆర్పై ఉన్న అభిమానం మరోసారి వరంగల్ సభ ద్వారా బయటపడనుంది. అన్ని నియోజకవర్గాల నుంచి 3వేల నుంచి 4వేలమంది దాకా వరంగల్ సభకు తరలివెళ్లేలా ప్రణాళికలు రూపొందించాం.