గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను కూల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఫ్లాట్లను అప్పగించేందుకు అపార్ట్మెంట్ వాసులు అంగీకరించకపోవడంతో వారిని విభజించి విడదీసేందుకు కుట్రలు చేస్తున్నది. అపార్ట్మెంట్ వాసులందరికీ భూమికి భూమి, ఫ్లాట్‌కు ఫ్లాట్ ఇస్తామంటూ ప్రభుత్వ ప్రతినిధులు మభ్యపెడుతూ వచ్చారు. రోజుకో మాట, పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారు. అటు అధికారులేమో భూసేకరణ నిబంధనల ప్రకారం భూములు, ఫ్లాట్లు కోల్పోయిన వారికి టీడీఆర్ ఇస్తామంటూ తేల్చి చెప్తున్నారు.
సిటీ బ్యూరో, (నమస్తే తెలంగాణ) : మినీ ఇండియాగా పేరొందిన మధు పార్కు రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు మాత్రం తాము ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా అక్కడి నుంచి కదలబోమని తెగేసి చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం వారిని విడదీసి, విభజించి ఫ్లాట్లను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మూసీ పరీవాహక ప్రజల అభ్యంతరాలను సేకరించేందుకు ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మధు పార్క్ అసోసియేషన్‌లోని కొద్ది మంది ప్రతినిధులను పిలిపించుకుని హామీల వర్షం కురిపిస్తున్నదని అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. వారిని మభ్యపెట్టేందుకు ప్రాజెక్టులో భాగమైన ఓ ఉన్నతాధికారిని రంగంలోకి దింపినట్లు వారు చెప్తున్నారు. ఆ అధికారి కొద్దిమంది అపార్ట్మెంట్ వాసులు, అసోసియేషన్ ప్రతినిధులను కలిసి అపార్ట్మెంట్ ఖాళీ చేసేందుకు అంగీకరించాలని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
అసోసియేషన్‌ను తప్పుదోవ పట్టించి అపార్ట్‌మెంట్‌ను స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నట్లు వాపోతున్నారు. సబ్‌కమిటీ కూడా కొద్ది మందిని మభ్యపెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేలా ప్రోత్సహిస్తున్నదని చెప్తున్నారు. అపార్ట్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం చెర నుంచి రక్షించుకునేందుకు న్యాయపోరాటమే శరణ్యమని మెజారిటీ యజమానులు భావిస్తున్నారు. ఇటీవల తమ ఇండ్లను కాపాడుకునేందుకు హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేద్దామా? పరిహారంపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుదామా? అనే అంశాలపై అసోసియేషన్‌లో ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించినట్లు తెలుస్తున్నది. ఆ ఓటింగ్‌లో ఎక్కువ మంది న్యాయపోరాటం చేసేందుకే మొగ్గు చూపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదని ఎక్కువ మంది తమ అభిప్రాయాలను వెలుబుచ్చినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా ప్రభుత్వ ప్రతినిధులు కానీ, ఎంఆర్డీసీఎల్ అధికారులను కలుస్తున్న విషయాన్ని అసోసియేషన్ ప్రతినిధులు అపార్ట్మెంట్లో ఎవరికీ తెలియజేయడం లేదని ఆరోపిస్తున్నారు. అసోసియేషన్ ప్రతినిధులు అధికారులు, మంత్రులను కలుస్తున్న విషయాన్ని తాము సోషల్ మీడియా, వార్తాపత్రికల్లో చూసిన తర్వాతనే తెలుస్తున్నదని వాపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే అన్ని వివరాలు తెలియజేస్తామని దాటవేస్తున్నట్లు కొంతమంది ప్ల్లాట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, తమ అభిప్రాయాలు తీసుకోకుండా అధికారులు, మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీతో ఎలా సమావేశమవుతారని ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరికి వారే ఇష్టారీతిన వ్యవహరిస్తే అందరికీ నష్టం చేకూరుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం విడదీసి ఇండ్లను కూల్చేందుకు చేస్తున్న కుట్రలకు బలికాకూడదని సూచిస్తున్నారు.