ఖైరతాబాద్, ఆగస్టు 18: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం వచ్చిందని, ఇప్పుడు తమ వ్యాపారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు మరో అస్థిత్వ ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నాడు వలస పాలకులు ఉపయోగించిన బాషనే నేడు మార్వాడీలు ఉపయోగిస్తున్నారని, వారిని కట్టడి చేయాల్సి అవసరం ఉందన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ‘మార్వాడీ సమస్యలు.. పరిష్కారాలు.. మేథో చర్చ’ అనే అంశంపై తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణను నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్నామని, తమ వ్యాపారాలు తమవేనంటూ కూడా ఉద్యమాలు రావాల్సి ఉండేదన్నారు. తమిళనాడు తరహా వాతావరణం తెలంగాణలో రావాలన్నారు. భారతదేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని, రాజ్యాంగం హక్కు కల్పించిందని, అయితే ఇతరుల వ్యాపారాలను చెడగొట్టి వ్యాపారాలు చేసుకోమని చెప్పలేదన్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారు ఈ ప్రాంతంలో అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు పరిపూర్ణాచారి మాట్లాడుతూ గతంలో రాజాకర్ల కాలంలో శ్రమ దోపిడీ జరిగేదని, ఇప్పుడు వృత్తిదోపిడీ జరుగుతున్నదన్నారు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ప్రేమ్‌గాంధీ మాట్లాడుతూ అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ దందా విషయంలో కిరాణా షాపులపై దాడులు జరిగితే 97 శాతం ఆ వర్గాలే ఉన్నాయన్నారు. తాను బీజేపి కార్యకర్తనైనా నేడు ఆ పార్టీయే ఇక్కడి వారికి మద్దతు ఇవ్వకపోవడం బాధకరంగా ఉందన్నారు.
బీజేపి నేత ఉప్పల విజయ్ మాట్లాడుతూ మార్వాడీకి సంబంధించిన ఓ సమాజం మొట్టమొదటి సారి ఖైరతాబాద్‌కు వచ్చిందని, పాన్‌బ్రోకర్ వ్యాపారం నిర్వహించుకుంటూ నేడు హైదరాబాద్ బంగారం వ్యాపారంలో రాజ్యమేలే స్థాయికి చేరుకున్నారన్నారు. బీజేపీ నాయకులు మార్వాడీలకు వంత పాడుతుండడం బాధాకరమన్నారు. రాజాసింగ్ రాజీనామా చేస్తే తనకు టికెట్ వస్తుందనే మాధవీలత మార్వాడీలకు మద్దతుగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఆమె నెట్ వర్త్ రూ.200 కోట్లుగా చూపించారని, ప్రముఖ ఆస్పత్రిని నిర్వహిస్తున్న ఆమెకు అంత సంపద తెలంగాణ ప్రజల ద్వారానా లేక మార్వాడీ వల్ల వచ్చిందా అనేది స్పష్టం చేయాలన్నారు.
రచయిత జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ 1950కి ముందు వచ్చిన మార్వాడీలు ఇక్కడే స్థిరపడిపోయారని, అలాగే 2009కి ముందు వచ్చిన వారు సైతం ఇక్కడి సంస్కృతిలో భాగమయ్యారని, తెలంగాణ ఉద్యమంలో సైతం పాల్గొన్నారని, కాని 2014 తర్వాత వచ్చిన మార్వాడీలతోనే ప్రమాదముందన్నారు. మార్వాడీలు హిందువులంటూ మాట్లాడుతున్న కేంద్రమంత్రి బండి సంజయ్‌కు తెలంగాణలో పుట్టి పెరిగిన హిందువులు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు.
అనంతరం తెలంగాణ ప్రజలను అవమానిస్తూ మాట్లాడిన గుజరాతీ, మార్వాడీ సమాజ్ నాయకులు క్షమాపణ చెప్పాలని, వారు చేస్తున్న వ్యాపారాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని, రాష్ట్రంలో బయట రాష్ర్టాల వారు పెట్టిన వ్యాపారాల్లో ఇక్కడి వారికే 89 శాతం ఉద్యోగాలను ఇవ్వాలని, తెలంగాణ శ్యామ్, గోరటి రమేశ్‌లను చంపుతామంటూ బెదిరించిన మార్వాడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తెలంగాణేతరులు ఇక్కడ భూములు కొనకుండా చట్టం చేయాలని, తెలంగాణ ప్రజలు మార్వాడీ, గుజరాతీలకు సహాయ నిరాకరణ చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో కవి, రచయిత నందిని సిధారెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్, తెలంగాణ విఠల్, శ్యామ్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, తెలంగాణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారోజు జగ్జీవన్, ఆర్యవైశ్య మహాసభ నాయకులు సముద్రాల శ్రీకాంత్ పాల్గొన్నారు.