Drugs | మాదాపూర్, ఫిబ్రవరి 17: హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆలివ్ బిస్ట్రో పబ్‌పై పోలీసులు తనిఖీలు చేశారు. పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చింది.
మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 45లో గల ఆలివ్ బిస్ట్రో పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పక్కా సమాచారం రావడంతో తనిఖీలు చేశామని తెలిపారు. ఆ సమయంలో 20 మందికి మూత్ర పరీక్షలు నిర్వహించగా.. అందులో 22 ఏండ్ల యువకుడికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. అతన్ని విచారించగా గత నెలలో థాయిలాండ్‌కు వెళ్లానని తెలిపాడు. అక్కడ బిస్కెట్లు తిన్నానని.. అందులో డ్రగ్స్ ఉన్నట్లు తనకు తెలియదని పోలీసులకు తెలిపారు. కాగా, సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ సెంటర్‌కు తరలించారు.