మియాపూర్ : అగ్ని ప్రమాదాలు, సిలిండర్ పేలుళ్లు, విద్యుత్ షాట్ సర్క్యూట్ వంటి అనూహ్య విపత్తులు సంభవించినపుడు స్వీయ రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఇలాంటి సందర్భాలలో సహాయక బృందాల కోసం వేచి చూసే లోపు ధైర్యంతో తగు అవగాహనతో కనీస చర్యలు తీసుకోవటంపై తప్పకుండా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు.
హైదర్‌నగర్ డివిజన్ నిజాంపేట రోడ్డులో సెవెన్ హిల్స్ అపార్టుమెంట్లో ఫైర్ వింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన, మాక్ డ్రిల్‌ను చేపట్టారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు సహా ఫైర్ విభాగం అధికారులతో కలిసి విప్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తరహా ప్రమాదాల పట్ల ఫైర్ సిబ్బంది ప్రజలలో కల్పిస్తున్న అవగాహన, స్వీయ రక్షణ చర్యలు తెలుసుకోవాలని, అనూహ్య సంఘటనల సందర్భంలో కనీస స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
పోలీస్ పరమైన సేవలకు 100 , ఫైర్ పరమైన సేవలకు 101 నంబర్లకు డయల్ చేసి సహాయం పొందాలని విప్ గాంధీ సూచించారు. అదనపు ఇన్సెపెక్టర్ వెంకటేశ్, స్టేషన్ ఫైర్ అధికారి కృష్ణారెడ్డి, ట్రాఫిక్ విభాగం అధికారి భాస్కర్, రామకృష్ణ, జలమండలి మేనేజర్ ప్రశాంతి, పార్టీ నేతలు పోతుల రాజేందర్, అప్పిరెడ్డి, కిరణ్, నారాయణ, చంద్రశేఖర్, మురళీ, రవీంద్రబాబు, రవికిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.