సిటీబ్యూరో, ఆగస్ట్ 2 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ గేమింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని.. ఈజీ మనీ కోసం ముగ్గురు విద్యార్థులు.. మనీలాండరింగ్‌కు పాల్పడ్డావని ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి.. అతడి నుంచి రూ.6.5లక్షలు కాజేశారు. ఈ కేసులో ముగ్గురు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ధూల్‌పేటకు చెందిన 57ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగికి జనవరిలో సైబర్ నేరగాళ్ల నుంచి ఒక కాల్ వచ్చింది.
తాను డీసీపీనని పరిచయం చేసుకుని.. మీరు రూ.2కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా కేసు నమోదైందని, ఇందుకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఓపెన్ చేయడానికి బాధితుడి ఆధార్‌కార్డు వాడినట్లుగా చెప్పాడు. బాధితుడిపై అరెస్ట్ వారెంట్ వచ్చిందంటూ వారెంట్, సుప్రీంకోర్టు పర్మిషన్, ఆర్బీఐ నోటీసులంటూ ఫేక్ డాక్యుమెంట్స్ పంపి బెదిరించాడు. ఆ తర్వాత ఈ కేసులో నుంచి బాధితుడి పేరు తీసేయాలంటే మీ బ్యాంక్ డిటైల్స్ అన్నీ పంపించాలని, కొంత మనీ డిపాజిట్ చేయాలని చెప్పగా.. బాధితుడు ఆ వివరాలు ఇవ్వడంతో పాటు రూ.6.5లక్షలు పంపించాడు.
ఆ తర్వాత నేరగాళ్లు అతనిని సంప్రదించకపోవడంతో బాధితుడు మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు దర్యాప్తు చేసి నల్గొండ జిల్లా అనుములకు చెందిన హేమంత్‌రెడ్డి, రంగారెడ్డిజిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన యశ్వంత్‌రెడ్డి, సికింద్రాబాద్ కార్ఖానకు చెందిన తరుణ్‌లను అరెస్ట్ చేశారు. అరస్టైన వారంతా విద్యార్థులే కావడం గమనార్హం.
ఈ ముగ్గురు దురలవాట్లతో ఫ్రాడ్ గేమింగ్ సైట్స్‌లో డబ్బులు పోగొట్టుకుని ఈజీమనీ కోసం సైబర్‌నేరగాళ్లకు కమీషన్ పద్ధతిలో బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు వీరు సైబర్‌నేరాల్లో వాడినట్లుగా గుర్తించిన సుమారు 40ఖాతాలను నేరగాళ్లకు సమకూర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు విద్యార్థులు దేశవ్యాప్తంగా 23 కేసుల్లో ఉన్నట్లుగా సైబర్‌క్రైమ్ డీసీపీ దారా కవిత, ఏసీపీ శివమారుతి, ఇన్స్పెక్టర్ సతీష్‌రెడ్డిలు తెలిపారు.
గోల్డెన్అవర్లో ఫిర్యాదు చేయాలి..
సైబర్ నేరం జరిగిన మొదటి 60 నిమిషాల సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారని, బాధితులు ఆ సమయంలో 1930కు ఫిర్యాదు చేయడంతో పాటు వివరాలు సమగ్రంగా ఇవ్వగలిగితే సైబర్ పోలీసులు వాటిని కట్టడి చేయగలుగుతారని సైబర్ క్రైమ్ డీసీపీ దారాకవిత తెలిపారు. అంతేకాకుండా గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేస్తే నేరస్తుల ఖాతాలను ఫ్రీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఖాతాలు ఫ్రీజ్ అవ్వడంతో పాటు బాధితుల డబ్బులు తిరిగి పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె తెలిపారు. సైబర్ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల నేరస్తులను వేగంగా ట్రేస్ చేయవచ్చని, లావాదేవీలు జరిగిన స్క్రీన్ షాట్స్‌ను పోలీసులకు చూపించాలని, నేరస్తులను పట్టుకునేందుకు అవి ఉపయుక్తంగా ఉంటాయని డీసీపీ సూచించారు.
కరెంట్ బిల్లు పెండింగంటూ ..
నగరానికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ నేరగాడు ఫోన్‌చేసి.. మీ కరెంట్ బిల్లు పెండింగ్ ఉందంటూ.. ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి.. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్లన్నీ తన కంట్రోల్లోకి తీసుకుని.. అతని ఖాతా నుంచి రూ.5.48లక్షలు కొట్టేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి గత నెల 28న శుభమ్ అగర్వాల్ అనే పేరుతో సైబర్ నేరగాడు వాట్సాప్ కాల్చేసి.. తాను తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డు ఆఫీసర్‌నంటూ మాట్లాడి.. మీ అపార్ట్మెంట్ విద్యుత్ బిల్లు ఓవర్ డ్యూ ఉందని, డిస్కనెక్షన్ కావద్దంటే బిల్లు కట్టాలని సూచించాడు.
బాధితుడికి వాట్సప్‌లో పీడీఎఫ్ పంపి దానిని డౌన్ లోడ్ చేసుకుని.. ఎలక్ట్రిసిటీ బిల్ పే.ఏపీకే అనే యాప్‌ను ఇన్స్టాల్ చేయమని సూచించాడు. బాధితుడు ఆ పీడీఎఫ్‌ను డౌన్లోడ్ చేసుకోలేకపోవడంతో నేరగాడు బాధితుడి భార్య మొబైల్‌కు పంపాడు. యాప్ ఇన్స్టాల్ చేసిన గంటలోపే బాధితుడి ఎస్బీ అకౌంట్‌తో పాటు ఓడీ, ఎఫ్డీ అకౌంట్స్ ను నేరగాడు ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు. అతని బ్యాంక్ అకౌంట్స్ అన్నీ వారి కంట్రోల్‌కి వెళ్లిపోయాయి. బాధితుడి ఖాతాల నుంచి రూ.5,48,799 లక్షలు కాజేశారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.