సిటీబ్యూరో, మే 10, (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనున్నది. సోమవారం జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టూరిజం ప్లాజాలో పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లు, పోలింగ్‌కు 72 గంటలు, 48 గంటల ముందు అత్యంత కీలకమైన నిశ్శబ్ద కాలానికి సంబంధించిన నిబంధనలపై సీపీ శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్,
సికింద్రాబాద్ కంటోన్మెంట్ రిటర్నింగ్ అధికారి, సీఈవో మధుకర్ నాయక్‌లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలకు జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మ్యాన్‌పవర్, మెటీరియల్ వంద శాతం పూర్తయిందని, ఈవీఎం కమిషనింగ్, పోలింగ్‌కు ముందు జరగాల్సిన ప్రక్రియ అంతా పూర్తి చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 3986 పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశామని, 1250 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని వెల్లడించారు.
13న పోలింగ్ సజావుగా జరిగేలా 15వేల మందితో భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం 6.00 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లోకి వస్తుందని, పోలింగ్ ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. శనివారం సాయంత్రం 6.00 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు మద్యం షాపులను మూసివేస్తున్నట్లు తెలిపారు.
పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి పోలీసు సిబ్బంది, ఎన్నికల అధికారులు నిర్వహించాల్సిన విధి విధానాలపై బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారాభవన్‌లో సీపీ శ్రీనివాస్‌రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. పోలింగ్ రోజు వాహనాలు బూత్‌ల వద్దకు వెళ్లకుండా ఆపడం, ఓటర్లు మొబైల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్లకుండా చూడటం తదితర అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ పాల్గొన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 14,292 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హకు వినియోగించుకున్నారని, హోం ఓటింగ్ ద్వారా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 362 మంది, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 119 మంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో 55 మంది తమ ఓటు హకును వినియోగించుకున్నట్లు రోనాల్డ్ రాస్ వివరించారు. ఎసెన్షియల్ సర్వీసెస్ ఓటర్లు 7 మంది ఓటు హకు వినియోగించుకున్నారని పేర్కొన్నారు.
జిల్లాలో సీ -విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 339 ఫిర్యాదులు రాగా, అన్నింటినీ పరిషరించామని, ఆయా ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో మరింత నిఘా పెట్టామని తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి అవసరమైన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో మెడికల్ టీం ఉంటుందన్నారు. ఓటర్లకు పోల్ క్యూ రూట్ యాప్‌ను అందుబాటులో ఉంచామన్నారు. క్యూలో ఎంతమంది ఉన్నారు? ఎంత సమయం పడుతుంది అన్న వివరాలు ఓటర్లు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. దీంతోపాటు పోలింగ్ కేంద్రాల లొకేషన్ చూసుకోవచ్చని రోనాల్డ్ రాస్ సూచించారు.
పోలింగ్ సిబ్బందికి మే 12, 13వ తేదీల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని, ఇందుకోసం జిల్లాలో సుమారు 37 పాయింట్స్ గుర్తించామని రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. పోలింగ్ ముందు ఆ పాయింట్ల నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వరకు పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ సంబంధించిన మెటీరియల్ అందజేసిన అనంతరం రిసెప్షన్ సెంటర్ నుంచి తిరిగి.. గుర్తించిన పాయింట్ వద్ద ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ‘సాక్ష్యం’ యాప్ ద్వారా ఇప్పటివరకు 311 మంది ఫ్రీ పికప్, ఓటు వేసిన తర్వాత తిరిగి డ్రాప్ చేయాలని అభ్యర్థన పెట్టారని, వారందరికీ ఆ సౌకర్యం కల్పిస్తామన్నారు.
48 గంటల సైలెన్స్ పీరియడ్ అయిన శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి జిల్లాలో జిల్లాయేతర వ్యక్తులు, ఇతర నియోజకవర్గం వారు ఎవరూ ఉండకూడదని స్పష్టం చేశారు. అన్ని ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అప్రమత్తతో క్షేత్ర స్థాయిలో పని చేస్తారని ,కళ్యాణ మండపాలు, హోటల్, లాడ్జింగులు వంటివి తనిఖీ చేస్తారని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి లేకుండా పోలింగ్ రోజున, అలాగే పోలింగ్‌కు ఒక రోజు ముందు ఈ నెల 12, 13వ తేదీల్లో ప్రింట్ మీడియాలో ఎంసీఎంసీ అనుమతి లేకుండా ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలను ప్రచురించవద్దని సూచించారు.