రంగారెడ్డి జిల్లా కోర్టులు, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కుటుంబ తగాదాలతో విడిపోయిన భార్యాభర్తలను లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా కలిపి.. సంతోషంగా జీవించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. అలాగే సివిల్ వివాదంలో కొన్నేండ్లుగా విడిపోయిన అన్నదమ్ముల సమస్యను పరిష్కరించి వారిని కూడా కలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో శనివారం రంగారెడ్డి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ బెంచ్‌లను హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ శ్యామ్ కోషి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కక్షిదారులు లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. లోక్ అదాలత్‌లో ఏర్పాటు చేసిన 38 బెంచ్‌ల ద్వారా 7 లక్షల పైచిలుకు రాజీకి యోగ్యమైన పలు కేసులు పరిష్కరించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సంస్థ సభ్య కార్యదర్శి యస్.గోవర్ధన్‌రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌కుమార్ హాజరై లోక్ అదాలత్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మొత్తం 7 లక్షల కేసులను పరిష్కరించి.. 7.60 కోట్ల రూపాయల నష్టపరిహారం బాధితులకు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి పట్టాభిరామారావు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి దీకొండ రవీందర్, పట్లోళ్ల మాధవరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కస్తూరితో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని రుణ వసూళ్ల ట్రిబ్యునల్ కోర్టు-2లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 108 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. 384.38 కోట్లకు గాను లోక్ అదాలత్‌లో 103.67కోట్ల మేరకు రికవరీ అయ్యాయని తెలిపారు. అలాగే డీఆర్టీ కోర్టు-1లో 12 కేసులు పరిష్కారం కాగా, రూ.71.51కోట్లు రికవరీ అయ్యాయని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా అబిడ్స్‌లోని డీఆర్టీ కోర్టు-1, 2 న్యాయమూర్తులు గుమ్మడి గోపీచంద్, రామేశ్వర్ కోటే మాట్లాడుతూ.. 62 కేసులకు గాను 53.75కోట్లు రావలిసి ఉండగా, అందులో 31.55కోట్లు రికవరీ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్టీ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.సంజయ్‌కుమార్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు విజయ్‌కుమార్, టి.శ్రీధర్, టి.శ్రీధర్‌రెడ్డి, వి.రవీందర్, రణధీర్‌సింగ్, దినేశ్‌కుమార్, ముఖేశ్ కుమార్, జె.నరేందర్, సత్యనారాయణ, బి.రమణ కుమారి పాల్గొన్నారు.
మేడ్చల్, డిసెంబర్30(నమస్తే తెలంగాణ): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మల్కాజిగిరిలో జాతీయ లోక్ అదాలత్ జరిగింది. లోక్ అదాలత్‌లో న్యాయమూర్తుల సమక్షంలో రాజీ మార్గం ద్వారా 4 కేసులను పరిష్కరించారు. జిల్లా అదనపు న్యాయమూర్తులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీ. ఆర్. మధుసూదన్‌రావు, జె.విక్రమ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.అరుణ్‌తేజ్ సమక్షంలో రాజీ చేసుకున్నారు. లోక్ అదాలత్‌లో హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్యామ్ కోషి, సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.