సిటీబ్యూరో, జూన్ 22(నమస్తే తెలంగాణ): మేడ్చల్ మెట్రో సాధన కోసం స్థానికులు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. రెండో దశ విస్తరణలో భాగంగా జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్పేట మార్గంలో నిర్మించాల్సి ఉండగా, కేంద్రానికి డీపీఆర్ సమర్పించినట్లు మెట్రో సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో కేంద్రం వద్ద డీపీఆర్ అనుమతుల విషయంలో జాప్యం లేకుండా ఉండేందుకు తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలను సంప్రదింపులు, చర్చలు, ఫ్లకార్డుల ప్రదర్శన వంటి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఎంపికైన బీజేపీ ఎంపీలతో పాటు, పార్టీలకతీతంగా అన్ని పార్టీల నేతలను కలిసి తమ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తామని మేడ్చల్ మెట్రో సాధన సమితి వెల్లడించింది. నిత్యం 30 లక్షల మంది రాకపోకలు సాగించే ఈ ప్రాంతానికి అధునాతన రవాణా సదుపాయాలే.. నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.
మూడు నెలల ఆలస్యం తర్వాత మెట్రో విస్తరణ ప్రతిపాదనలు కేంద్రానికి చేరాయి. ఇప్పటికీ రెండో దశ పార్ట్ ఏకు అనుమతులు రాలేవు. ఈ క్రమంలో పార్ట్ బీ విషయంలో ఏ మాత్రం జాప్యానికి తావు లేకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వ నేతలపై ఒత్తిడి పెంచాలని మెట్రో సాధన సమితి భావిస్తున్నది. నిర్ణీత కాలంలో ప్రాజెక్టు పనులు మొదలు కావాలంటే, అనివార్యంగానే ప్రజల మద్దతు కూడగట్టేలా కార్యాచరణ అవసరమని సాధన సమితి సభ్యులు పేర్కొంటున్నారు.
తమ ప్రాంతానికి మెట్రో సాధన కోసం ఇన్నాళ్లు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, మెట్రో సంస్థతో సంప్రదింపులు చేసినట్లుగానే… ఇకపై ఢిల్లీ స్థాయిలో ప్రభావితం చేసేలా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ఎంపీలను కలిసి తమ ప్రాంతానికి మెట్రో ఆవశ్యకతను వివరిస్తామని పేర్కొంటున్నారు.