మేడ్చల్, మే10 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుంటే.. సిబిల్ స్కోర్ ఆధారంగానే రాయితీ రుణాలు అందజేస్తామనే ప్రచారంతో దరఖాస్తుదారుల గుండెలు గుబేల్ మంటున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో భాగంగా దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైన నేపథ్యంలో రాజీవ్ యువ వికాసం పథకం పోందాలంటే సిబిల్ సోర్క్ తప్పనిసరిగా ఉండాల్సిందే అని ప్రభుత్వం నుంచి లీకులు వెలువడుతుండటంపై సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.
జిల్లా వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి 66,648 దరఖాస్తులు వచ్చాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను విభజించిన అనంతరం దరఖాస్తుల పరిశీలనకు మండల, పట్టణ, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, కార్పొరేషన్‌కు చెందిన అధికారితో పాటు బ్యాంక్ ఉద్యోగి సభ్యులుగా ఉన్నారు.
దరఖాస్తుల పరిశీలన ఇలా..
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు వర్తింపజేయాలంటే ప్రధానంగా సిబిల్ స్కోర్‌ను చూడనున్నారు. గత 5 సంవత్సరాలుగా కార్పొరేషన్ల నుంచి ఏమైనా రుణాలు తీసుకున్నారా, ఆ కుటుంబలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా, దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్ ఎంత ఉంది తదితర విషయాలను దరఖాస్తుల పరిశీలనలో తేల్చనున్నారు.
అంతకుముందు ప్రభుత్వం నుంచి రాయితీ రుణాలు పొందితే దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి బీసీ, ఈబీసీ 37,935, ఎస్సీ 16,300, ఎస్టీ 2,196, మైనార్టీలు, క్రిస్టియన్లు 10,217 వారీగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రారంభించిన ఈ పథకానికి సిబిల్ వంటి కొర్రీలు లేకుండా లోన్లు అందించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.