సిటీబ్యూరో, ఏప్రిల్18, (నమస్తే తెలంగాణ): మానవుని జీవనశైలిలో సంభవిస్తున్న మార్పులే కాలేయ వ్యాధికి దారితీస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నాన్-అల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, మద్యపానం తాగేవారే లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్, పంచదార, కొవ్వు పదార్థాలు మితిమీరి తీసుకోవడం, కదలికలేని జీవనశైలి వల్ల బరువు పెరడం మూలానా ఫ్యాటీ లివర్, టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయి. మద్య పానాన్ని మానుకోవడం, సురక్షిత లైంగిక సంబంధాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండటం వల్ల జీవనశైలిలో నూతన మార్పులు మొదలై మన కాలేయాన్ని కాపాడుకోగలగిన వారమవుతాం. నేడు ‘ప్రపంచ కాలేయ దినోత్సవం’ సందర్భంగా కాలేయ వ్యాధి గురించి అవగాహన పెంచుకోవడం అత్యంత అవసరం.
ఎక్కువగా మద్యం తీసుకోవడం వలన లివర్, ప్యాంక్రియాస్, మెదడు పై తీవ్ర ప్రభావం చూపుతుంది. లివర్ వ్యాధి ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవు. మొదటగా హెపటైటిస్ వస్తుంది, దీని నుంచి సిరోసిస్ (లివర్ గట్టిపడటం) దశకు చేరుకోవడానికి 5-15 ఏండ్లు పడుతుంది. లక్షణాలు కనిపించే సమయానికి వ్యాధి ముందంజలోకి చేరుతుంది. ఫ్యాటీ లివర్‌కు మందులు తక్కువ ఉపయోగపడుతాయి. జీవనశైలి మార్పుల ద్వారా బరువు తగ్గడం మాత్రమే ఫ్యాటీ లివర్‌ను రివర్స్ చేయగలదు. బరువు తగ్గడం ద్వారా ఫైబ్రోసిస్, సిరోసిస్ నుంచి తప్పించుకోవచ్చు.
లివర్ క్యాన్సర్ మొదటి దశలో ఏ లక్షణాలు కనిపించవు. జాండిస్ నెమ్మదిగా వ్యాపిస్తున్నది. మన దేశంలో జాండిస్ వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించకుండా నాటు వైద్యం చేయిస్తుంటారు. నాటు వైద్యం వల్ల అనేకమంది డ్రగ్-ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీకి గురవుతున్నారు. జాండిస్ అనేది ఒక లక్షణం మాత్రమే, వ్యాధి కాదు. ఇది రాళ్లు, క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు, రక్త సంబంధిత వ్యాధుల కారణంగా వస్తుంది, దీనికి నిపుణుల పరిశీలన అవసరం. మద్యం సేవించేవారు, నాన్-అల్కహాలిక్ ఫ్యాటి లివర్ డిసీజ్, హెపటైటిస్ బి, సి, మెటబాలిక్ వ్యాధులున్న వారు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం ఉత్తమం. లివర్ క్యాన్సర్‌కు రేడియోథెరపీ, సాధారణ కీమోథెరపీ పని చేయవు. ప్రత్యేక టార్గెట్ థెరపీ, ఇమ్యునోథెరపీ, స్థానికంగా చేసే ట్రీట్మెంట్లు(టీఏసీఈ, టీఏఆర్ఈ, ఆర్ఎఫ్ఏ) అవసరం. లివర్ ఆకారాన్ని కాకుండా, దాని పనితీరును బట్టి ట్రాన్స్‌ప్లాంట్ అవసరమా? లేదో నిర్ణయిస్తారు.
ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్ ‘లివర్ హెల్త్ ఇనిషియేటివ్’ ప్రారంభించింది. నాలుగు ప్రత్యేక లివర్ క్లినిక్‌లు ప్రారంభించగా, కాలేయ సంబంధిత వ్యాధులను తొలి దశలోనే గుర్తించి, నివారించి, నిపుణుల ద్వారా చికిత్స అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా నాన్-అల్కహాలిక్ ఫ్యాటి లివర్ డిసీజ్, వైరల్ హెపటైటిస్ వంటి సమస్యలపై దృష్టి సారించనున్నారు. భారతదేశంలో జనాభాలో సుమారు 35% మంది నాన్-అల్కహాలిక్ ఫ్యాటి లివర్ డిసీజ్‌తో బాధపడుతున్నారు. వీరిలో 88% మందిలో డయాబెటిస్ ఉండటం గమనార్హం. సాధారణ బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్ఐ) ఉన్న వారిలో కూడా 720% వరకూ ఈ వ్యాధి కనిపిస్తున్నది. దీనినే ‘లీన్ నాష్’ అంటారు. దీనికి చికిత్స అందించకుంటే లివర్ సిరోసిస్, ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చు. స్టార్ లివర్ ఇనిస్ట్టిట్యూట్ ద్వారా ఇలాంటి రోగులకు త్వరగా చర్యలు తీసుకొని, జీవనశైలి మార్పుల ద్వారా చికిత్స చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
దేశంలో ఏటా 5000 కంటే ఎక్కువ ట్రాన్స్ప్లాంట్లు జరుగుతున్నాయి, 90-95% విజయం సాధిస్తున్నాం. పేషెంట్ ఆరోగ్య స్థితి మరియు వ్యాధి తీవ్రతపై ఆధారపడి ఫలితాలు మారుతాయి. వ్యాధి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యనిపుణులను సంప్రదించడం అత్యంత అవసరం.
– డా. రావుల ఫణి కృష్ణ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్