సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి రిజర్వేషన్ల వివరాలతోపాటు గడిచిన రెండేళ్లకు సంబంధించి మద్యం అమ్మకాల వివరాలను అందచేయాలని హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ సమావేశ మందిరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ యూనిట్ల పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ బృందాలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేవారికి దరఖాస్తుల సమూనాలో ఏ రకమైన తప్పిదాలు లేకుండా ఎక్సైజ్ సిబ్బంది సహకారం అందించాలని, దరఖాస్తుదారులకు రశీదులు, ఎంట్రీ పాసులు అందాయా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించాలని, కొత్త వారు దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చినప్పుడు వారికి తగిన సూచనలు అందించాలని సూచించారు. ఏ షాపుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని రోజువారిగా కౌంటర్ల వద్ద ప్రదర్శించాలని ఆదేశించారు. అంతేకాకుండా అప్టేక్లు, ఎన్డీపీఎల్ అమ్మకాలు జరుపుతున్న కేంద్రాలపై నిఘా పెడుతూ, ఆబ్కారీ నేరాలకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంక్షారి, ఏఈఎస్ శ్రీనివాసరావులతో పాటు 11 స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్సైలు పాల్గన్నారు.