దుండిగల్, అక్టోబర్ 31: ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన లిఫ్ట్‌వైర్ తెగిన ప్రమాదంలో ఏడుగురు మహిళా ఉపాధ్యాయురాళ్లతోపాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా, పాఠశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా క్షతగాత్రులను స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించింది. ఈ విషయాన్ని కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అటు దవాఖాన యాజమాన్యం, ఇటు పాఠశాల యాజమాన్యం గుట్టుగా చికిత్స అందించడంపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
స్థానికులు తెలిపిన ప్రకారం… నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్ పరిధిలోని ఎలీఫ్ చౌరస్తా సమీపంలో నిర్వహిస్తున్న ‘గౌతమి మోడల్ స్కూల్-ఎంపరింగ్ టుమారో’ స్కూల్ సమయం ముగియడంతో శుక్రవారం సాయంత్రం 3:30 గంటల సమయంలో పని చేస్తున్న దీపిక(37), ప్రత్యూష(26), రజని(35), నాగశ్రీ(40), లక్ష్మీదుర్గ(37), శ్రావణి(35), రజిత(38) ఏడుగురు ఉపాధ్యాయులు లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా.. అధిక బరువు కారణంగా వైర్ తెగడంతో లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్‌కు పడిపోడిపోగా.. అందులోని అధ్యాపకులందరురూ గాయపడ్డారు.
దీంతో పాఠశాల యాజమాన్యం క్షతగాత్రులను స్థానిక పీపుల్స్ దవాఖానకు తరలించింది. క్షతగాత్రుల్లో స్వల్పంగా గాయపడిన ముగ్గురికి ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు వారిని డిశ్చార్చి చేయగా.. తీవ్రంగా గాయపడిన నలుగురికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని బాచుపల్లి సీఐ సతీశ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఈ విషయంలో తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని, సమాచారం కూడా ఇవ్వలేదని సమాధానమిచ్చారు.