Gandhi Hospital | బన్సీలాల్‌పేట్, మార్చి 13 : హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఘోరం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో లిఫ్టులో ఉన్న 15 మంది రోగులు, వారి అటెండర్లు తీవ్ర భయాందోళనకు గురై గట్టిగా కేకలు వేశారు. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని.. లిఫ్ట్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. లిఫ్ట్ వైర్లను సరిచేయడంతో అది ఐదో అంతస్తులో వచ్చి ఆగింది. అనంతరం లిఫ్ట్ డోర్ తెరిచి రోగులను, అటెండర్లను బయటకు తీసుకొచ్చారు. 15 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. 30 నిమిషాల పాటు లిఫ్టులో ఉండిపోయే సరికి కొందరికి ఊపిరాడలేదు.
ఈ సంఘటనపై అధికారులను వివరణ కోరగా పరిమితికి మించి ఓవర్ లోడ్‌తో వెళ్లడం వల్ల లిఫ్టు ఆగిందని, వెంటనే తమ సిబ్బంది అక్కడ చేరుకొని డోర్ ఓపెన్ చేయడం జరిగిందని అన్నారు. డాక్టర్లు, సిబ్బంది వెళ్లే లిఫ్ట్‌లో ఆపరేటర్లు ఉన్నారని, రోగులు, సాధారణ ప్రజలను తరలించే లిఫ్ట్‌లలో ఆపరేటర్లను ఎందుకు నియమించలేదని రోగి సహాయకులు ప్రశ్నించారు.