Gandhi Hospital | బన్సీలాల్ పేట్ మార్చి 13 : గాంధీ దవాఖానలో లిఫ్టు మధ్యలో ఆగిపోవడంతో రోగులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం నాలుగో నంబరు లిఫ్టు పైకి వెళ్తుండగా హఠాత్తుగా ఐదు, ఆరో అంతస్తులో మధ్యలో ఆగిపోయింది. అందులో ఉన్న 15 మంది గట్టిగా అరవడం మొదలుపెట్టారు. లిఫ్టులో చిక్కుకున్నాం.. డోరు తెరవండి అంటూ కేకలు వేయడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
సాంకేతిక సిబ్బంది పైనున్న వైర్లను సరి చేయడంతో 5 అంతస్తులో లిఫ్టు ఆగింది. దీంతో డోర్ తెరవడం ద్వారా లిఫ్టులో ఉన్న అందరిని క్షేమంగా బయటికి రప్పించారు. 30 నిమిషాల పాటు లిఫ్టులో ఉండిపోయామని, అందులో ఫ్యాన్ కూడా పనిచేయడం లేదని, ఉక్కపోత కారణంగా భయంతో కేకలు వేసామని బాధితులు తెలిపారు. ఈ సంఘటనపై అధికారులను వివరణ కోరగా పరిమితికి మించి ఓవర్ లోడ్ తో వెళ్లడంవల్ల లిఫ్టు ఆగిందని, వెంటనే తమ సిబ్బంది అక్కడికి చేరుకొని డోర్ ఓపెన్ చేయడం జరిగిందని అన్నారు.