ఖైరతాబాద్ : కరోనా, లాక్డౌన్ కారణంగా చదువుకు దూరమైన ఆడపిల్లలను తిరిగి బడికి పంపుదాం అన్న నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పీవీ మార్గ్ లోని నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ వద్ద వాకథాన్ నిర్వహించారు.
ఈ వాక్‌ను ముఖ్య అతిథులుగా హాజరైన వంగాల సంజీవ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్, సమాజ సేవకులు వి. సంజీవ రెడ్డి, షీ టీమ్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శిరీష రాఘవేంద్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో పాఠశాలలు తెరుచుకోకపోవడంతో చాలా మంది ఆడపిల్లలు చదువును మధ్యలోనే వదిలివేశారని, ప్రపంచ వ్యాప్తంగా 15 బిలియన్ల మంది, భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలోనూ చాలా మంది పాఠశాలకు వెళ్లడం లేదన్నారు.
అలాంటి వారిని గుర్తించి తిరిగి బడికి పంపే ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు కాంతిలాల్ షా, జనరల్ మేనేజర్ డాక్టర్ రేణు కపూర్, కౌన్సెలర్ ఎం. రాధిక, ప్రొగ్రాం అధికారి ప్రశాంత్ సరాఫ్, ఇండియా మెనోపాజ్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అంబుజ, ఉపాధ్యక్షులు డాక్టర్ ప్రభావతి, మాజీ అధ్యక్షులు డాక్టర్ బాలాంబ తదితరులు పాల్గొన్నారు.