చిక్కడపల్లి, డిసెంబర్ 2: వర్తమాన భాతరదేశ ఆర్థిక, సామాజిక అంతరాలతో కూడుకొని ఉన్నదని, ఈ అంతరాలు ప్రజల మధ్య ఐక్యతకు నిఘాతంగా ఉన్నాయని, ఈ అంతరాలను తగ్గించేందుకు అభ్యదయ శక్తులు ఏకం కావాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు చావ రవి ఆధ్యక్షతన మంగళవారం సాయంత్రం బాగ్‌లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ సీనియర్ నాయకుడు అక్షయకుమార్ దత్తు ద్వితీయ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్రం వచ్చే నాటికి సరిపడా ఆహారం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో సమాజంలో వెనుకబాటుతనం ఉండేదన్నారు.
నేడు విద్యా, వైద్యరంగాల్లో కార్పొరేట్ శక్తుల జోక్యం పెరిగి పేద, మధ్యతరగతికి విద్యా, వైద్య అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. ఈ విధానాలను రూపుమాపడం ద్వారా భారతదేశంలో సామాజిక ఐక్యతను సాధించొచ్చని, అందుకోసం నిరంతరం తపించిన అక్షయకుమార్ దత్తు ఆశాయాల సాధనకు కార్యకర్తలంతా పనిచేయాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి నిరంతరం పోరాటాలు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, ఐద్వా నాయకురాలు టి.జ్యోతి, సంయుక్త, నాయకులు నరహరి, మస్తాన్‌రావు, సింహాచలం, వెంకటప్ప, రాదేశ్యాం, దత్ భార్య లలితమ్మ, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.